టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్లలో ఒకరిని ఎన్నుకోమని అడిగితే వెంటనే సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా సమాధానమిచ్చాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత పొమ్మీ మబాంగ్వాతో వీడియో సెషన్లో పాల్గొన్నాడీ మాజీ ఇంగ్లీష్ క్రికెటర్. కోహ్లీ, స్టీవ్ స్మిత్లలో ఒకరిని ఎంచుకోమని అడిగిన ప్రశ్నకు.. కోహ్లీ అని సమాధానమిచ్చాడు. బ్యాటింగ్లో విరాట్ దరిదాపులకు కూడా స్మిత్ రాలేడని పీటర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పొమ్మీ మబాంగ్వా మరో అడుగు ముందుకేసి.. "సచిన్ లేదా విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఒకరిని ఎంచుకో" అని అడిగితే ఎలాంటి ఆలోచన లేకుండా కోహ్లీని ఎంచుకున్నాడు పీటర్సన్. ఎందుకంటే ఛేదనలో 80 శాతానికి పైగా సగటుతో కోహ్లీ రాణిస్తున్నాడని.. అతడి కెరీర్లో ఎక్కువ సెంచరీలు ఛేజింగ్లోనే నెలకొల్పాడని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ కోసం నేను ఏ విధంగా కష్టపడ్డానో, టీమ్ఇండియా కోసం కోహ్లీ అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నాడని తెలిపాడు.