పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుసగా సిక్సర్లు కొట్టడం చాలాసార్లు చూసుంటాం. టెస్టు క్రికెట్లో మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఐదు రోజుల క్రికెట్లో వరుసగా 4 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరో తెలుసా! ఇంకెవరు అది భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్. 1990 జులై 30న ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది టీమిండియాను ఫాలో ఆన్ ముప్పు నుంచి రక్షించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 653 పరుగుల చేసి డిక్లేర్ ఇచ్చింది. కెప్టెన్ గ్రాహమ్ గూచ్ 333 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రవిశాస్త్రి(100), అజారుద్దీన్(101) శతకాలతో ఆకట్టుకున్నారు. అయితే పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయిన భారత బ్యాట్స్‌మెన్ 9 వికెట్లు కోల్పోయి 430 పరుగుల చేశారు.
కపిల్ సిక్సర్ల సునామీ..
టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే 24 పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజులో ఒక ఎండ్‌లో కపిల్ దేవ్ ఉండగా.. మరో ఎండ్‌లో హిర్వాణీ ఉన్నాడు. ఇంగ్లీష్ బౌలర్ హెమ్మింగ్స్ వేసిన ఓవర్లో కపిల్ తొలి రెండు బంతులకు పరుగులేమి చేయలేదు. తర్వాత నాలుగు బంతులకు 4 సిక్సర్లు కొట్టి ఇంగ్లీష్ జట్టును ఆశ్చర్యపరిచాడు.
లాంగ్ ఆన్ దిశగా.. స్టైట్‌గా సిక్సర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్‌కు చెమటలు పట్టించాడు. తర్వాతి ఓవర్లో హిర్వాణీ.. ప్రేజర్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికే 24 పరుగులు రావడం వల్ల భారత్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో కపిల్ 75 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 272 పరుగులకు డిక్లేర్ ఇచ్చింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన టీమిండియా 247 పరుగులు భారీ తేడాతో పరాజయం పాలైంది. అయితే కపిల్ నాలుగు సిక్సర్లను మాత్రం క్రికెట్ ప్రియులు అంత త్వరగా మర్చిపోలేరు. 29 ఏళ్ల క్రితం ఇదే రోజున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కపిల్ రికార్డు సృష్టించాడు.
ఇది చదవండి: 'దీపా ఒలింపిక్స్ పర్యటనపై ఇప్పుడే ఏం చెప్పలేం'