ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్ 19)తో చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని భారత లెజెండరీ కెప్టెన్ కపిల్‌దేవ్ అన్నాడు. తానెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటానని, ప్రపంచం మొత్తం కలిసికట్టుగా ఉండి ఈ మహమ్మారిని జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలన్నాడు. భారత దేశ బలమంతా మన సంస్కృతిలోనే ఉందని తెలిపాడు.
"సామాన్య జనమంతా ఇప్పుడు పరిశుభత్ర పాఠాలు గుర్తు చేసుకుంటారు. చేతులు కడుక్కోవడం, రోడ్ల మీద ఉమ్మివేయకపోవడం, జనసంచార ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయకపోవడం లాంటివి అవలంభించాలి. ఎల్లప్పుడూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ ఇదివరకే పాటించాల్సింది. ఈ తరం వాళ్లైనా ఆ తప్పులు చేయరని ఆశిస్తున్నా. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతుడిని. మా సీనియర్ల నుంచి చాలా నేర్చుకున్నా. వారికి ధన్యవాదాలు. అలాగే మన దేశ బలమంతా భారతీయ సంస్కృతిలోనే ఉంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం, పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి."