ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ ఏడాది పలువురు మాజీ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలీస్, పాకిస్థాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్, ఆస్ట్రేలియా మహిళా మాజీ కెప్టెన్ లిసా స్టాలేకర్లు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా వల్ల ఈ వేడుకను వర్చువల్‌గా జరిపి పురస్కారాల్నిప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షాన్ పొలాక్, సునీల్ గావస్కర్ కూడా పాల్గొన్నారు.
నేను క్రికెట్ మొదలుపెట్టినప్పుడు ఇలాంటి సందర్భం ఒకటొస్తుందని అసలు ఊహించలేదు. ఏ ప్రశంసలు, సత్కారాల కోసం ఆటను ఆడలేదు. నేను నా దేశం కోసం ఆడాలని మాత్రమే కోరుకున్నా. కానీ క్రీడల్లో విజయం సాధించినవారి ప్రతిభను గుర్తించడం ఆనందంగా ఉంది. దీనికి నిజంగా గర్వపడుతున్నా.
జాక్వెస్ కలీస్, దక్షణాఫ్రికా ఆల్‌రౌండర్
అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరైన కలీస్.. 1995-2014 మధ్య 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు. టెస్టుల్లో 13,289, వన్డేల్లో 11,579 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సాధించాడు. మొత్తంగా 565 వికెట్లు తీశాడు. 10 వేలకుపైగా పరుగులు చేసి, 250 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు ఇతడే కావడం విశేషం.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన దక్షిణాఫ్రికా నాలుగో ఆటగాడు కలీస్. అబ్బాస్ పాకిస్థాన్ నుంచి ఆరో వ్యక్తి. స్టాలేకర్ ఆస్ట్రేలియా నుంచి 27వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా ఈ ఘనత సాధించిన తొమ్మిదో మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
ఇప్పటి వరకు 93 మంది క్రికెటర్లను హాల్ ఆఫ్ ఫామ్‌లో చోటు కల్పించింది ఐసీసీ. రిటైర్మెంట్ ప్రకచించిన ఆటగాళ్లు.. తమ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన ఐదేళ్ల తర్వాత ఈ సత్కారానికి అర్హులు.