క్రికెట్టే ధ్యాసగా ఎదిగిన యువకుడికి ఐపీఎల్ ఆహ్వానం పలికింది. నిన్నటిదాకా ఊరిలో బంతులు విసిరిన తెలుగు తేజం ఇకపై అంతర్జాతీయ మైదానంలో బౌన్సర్లు వేయనున్నాడు. ఆంధ్రా కుర్రాడు దిగ్గజాల సరసన చెన్నై జట్టులో ఆడనున్నాడు. కడప జిల్లాలోని చిన్నమండెం మండలంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన హరిశంకర్‌రెడ్డిని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు వేలంలో దక్కించుకుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఊళ్లోని పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన హరిశంకర్‌రెడ్డి 2016లో అండర్-19, 2018లో రంజీ స్థాయిలో ఆడాడు. పదునైన బౌలింగ్‌తో చెన్నై జట్టు యాజమాన్యాన్ని మెప్పించిన అతడు దిగ్గజ క్రికెటర్ ధోనీ సారథ్యంలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
హరిశంకర్‌రెడ్డి తల్లిదండ్రులకు వ్యవసాయమే ఆధారం. వారికి ఇద్దరు సంతానం కాగా పెద్దకుమారుడు ఉపాధి నిమిత్తం కువైట్‌లో స్థిరపడ్డాడు. హరిశంకర్‌రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి ఎప్పుడూ క్రికెట్ మైదానాల చుట్టూ తిరిగే తమ కుమారుడు ఈ స్థాయికి ఎదుగుతాడనుకోలేదంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.