హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎపెక్స్ కౌన్సిల్ కార్యవర్గ సభ్యుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌వర్మ తప్పుబట్టారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా తన నియామకాన్ని ఒక వైపు ఆమోదిస్తూ.. మరో వైపు వ్యతిరేకిస్తున్నారంటూ కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేశ్‌శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వార్‌లపై ఆగ్రహం వ్యక్తంజేశారు. అసంబద్ధ ఈమెయిల్‌లు, లేఖలు ఆపకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా ఉండేందుకు ఈ నెల 2న సమ్మతి పత్రాన్ని పంపించానని.. ఆరోజు నుంచే బాధ్యతలు మొదలైనట్లు మంగళవారం హెచ్‌సీఏకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
'హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా నా నియామకం చట్టబద్ధమే'
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎపెక్స్ కౌన్సిల్ కార్యవర్గ సభ్యుల వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌వర్మ మండిపడ్డారు. హెచ్‌సీఏ నియమావళి ప్రకారం అంబుడ్స్‌మన్‌గా తన నియామకం చట్టబద్ధమే అని సభ్యులకు స్పష్టం చేశారు.
హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్.. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్‌వర్మను నియమించాడు. అయితే ఆ అధికారం ఏజీఎంకు మాత్రమే ఉంటుందని, అజహర్ నిర్ణయం ఏకపక్షమని.. ఆ నియామకం చట్ట విరుద్ధమంటూ విజయానంద్, నరేశ్‌శర్మ, సురేందర్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్‌లు దీపక్‌వర్మకు లేఖలు రాశారు. దీనిపై స్పందించిన దీపక్‌వర్మ అన్ని వివరాలతో హెచ్‌సీఏ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశారు. హెచ్‌సీఏ నియమావళి ప్రకారం అంబుడ్స్‌మన్‌గా తన నియామకం చట్టబద్ధమేనని చెప్పారు. మార్చి 16తో పాటు జూన్ 6న జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కార్యవర్గ సభ్యులంతా హాజరయ్యారని, అంబుడ్స్‌మన్ నియామకం పట్ల ఒక్కరూ అభ్యంతరం చెప్పలేదని లేఖలో ఆయన చెప్పారు.