ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు ఐసీసీ జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో సఫారీ ఆల్‌రౌండర్ ఫిలాండర్‌ను పరుష పదజాలంతో దూషించిన కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
ఏం జరిగింది?
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఫిలాండర్ డిఫెండ్ చేసిన బంతిని కెప్టెన్ జో రూట్ అందుకుని కీపర్ వైపు విసిరాడు. వికెట్ల వద్ద నిలబడ్డ ఫిలాండర్ ఇది గమనించలేదు. "బంతికి అడ్డుగా నిలబడతావా" అని కీపర్ బట్లర్ పరుషమైన పదజాలం వాడాడు. బెన్‌స్టోక్స్ అతడికి వంత పాడాడు. ఈ కారణంగా ఐసీసీ ఆర్టికల్ 2.3 నిబంధనల ప్రకారం బట్లర్‌కు ఐసీసీ జరిమానా పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.
రెండేళ్ల వ్యవధిలో ఆటగాడు నాలుగు డీమెరిట్ పాయింట్లు పొందితే అతడిపై ఒక టెస్టు లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడకుండా సస్పెన్షన్ వేటు పడుతుంది.
ఈ ఘటనపై ఇంగ్లాండ్ ఆటగాళ్లను.. క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, అభిమానులు తీవ్రంగా విమర్శించారు. "చాలా స్పష్టంగా, పెద్దగా వినిపిస్తోంది" అని సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ ట్వీట్ చేశాడు. భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే "దయనీయం" అంటూ స్పందించాడు.
అయితే జో రూట్... ఈ ఘటనను తక్కువ చేసి చూపాడు. "ఇద్దరు క్రికెటర్లు చాలా కఠినంగా క్రికెట్ ఆడారు. శ్రుతిమించి ఏమీ జరగలేదు" అని అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా 1-1తో సమంగా నిలిచాయి. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా గెలవగా, రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మూడో టెస్టు ఈనెల 16న ప్రారంభంకానుంది.
ఇవీ చూడండి.. పాకిస్థాన్ సురక్షితమైన ప్రదేశం: క్రిస్‌గేల్