క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు? అంటే అభిమానుల నుంచి ఠక్కున వచ్చే పేరు జాంటీ రోడ్స్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు 90వ దశకంలో సేవలందించాడు. ప్రస్తుతం ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే అతడి ఫీల్డింగ్ మెరుపులు అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదంటూ పంజాబ్ జట్టు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
పాత రోజుల్ని గుర్తుకుతెచ్చిన జాంటీ రోడ్స్ క్యాచ్ - జాండీ రోడ్స్ తాజా వార్తలు
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ గుర్తింపు పొందాడు. ఇతడు ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. మరోసారి తన ఫీల్డింగ్ మెరుపులు ఇప్పటికీ తగ్గలేదని నిరూపించాడు రోడ్స్. ఈ వీడియోను పంజాబ్ జట్టు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఈ 51 ఏళ్ల మాజీ క్రికెటర్ ఆటగాళ్లు బంతులు విసురుతుంటే తన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇంత వయసులోనూ తనలోని పాత ఫీల్డర్‌ను గుర్తుకు తెచ్చాడు. ఒక బంతి అతడి కుడివైపు దూరంగా వెళుతుండగా గాల్లోకి డైవ్ చేసి పట్టిన తీరు మరోసారి అతడి పాతరోజుల్ని గుర్తుతెచ్చింది.
రోడ్స్ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 1992 ప్రపంచకప్ గురించి. అప్పుడు పాకిస్థాన్‌తో తలపడిన ఓ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్‌ను రనౌట్ చేసిన తీరు అమోఘం. ఇప్పటికి నాటి అభిమానుల కళ్లల్లో ఆ సంఘటన కదలాడుతూనే ఉంటుంది. ఇంజమామ్ ఓ బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా పాయింట్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న జాంటీ రోడ్స్.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బంతిని అందుకొని అమాంతం వికెట్ల పైకి ఎగిరాడు. దాంతో రెప్పపాటులో పాక్ మాజీ బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు. దాంతో జాంటిరోడ్స్ కెరీర్‌లో ఆ రనౌట్ చిరస్థాయిగా నిలిచిపోయింది.