అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. శనివారం కీలక నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీసీసీఐని కోరారు.
రాంచీలో పుట్టి పెరిగిన ధోనీ.. రాష్ట్రం తరఫున(అప్పటి బిహార్‌లో) దేశవాళీ క్రికెట్ ఆడాడు. బిహార్, ఈస్ట్ జోన్, ఝార్ఖండ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మహీ తన కెరీర్లో 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి.. 7,038 పరుగులు చేశాడు.
''దేశానికి, ఝార్ఖండ్‌కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన మహీ ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇకపై ఆ స్టార్ క్రికెటర్‌ను బ్లూ జెర్సీలో చూడలేం. అయితే, క్రికెట్ అభిమానుల మనసు ఇంకా వెలితిగానే ఉంది. కాబట్టి, రాంచీలో ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నా.''
-హేమంత్ సోరెన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి
ధోనీ తన కెరీర్లో 350 వన్డేలు ఆడి.. 10 వేల 773 పరుగులు చేశాడు. ఇక 98 టీ20 మ్యాచ్‌ల్లో 37.60 సగటుతో 1,617 పరుగులు సాధించాడు. మరోవైపు ఐపీఎల్లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి జరగనున్న లీగ్‌లో ధోనీ ఆడనున్నాడు.