టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. తాజాగా జిమ్లో ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు. త్వరలో మైదానంలో అడుగుపెడతానని చెప్పాడు. ఇటీవలే బంగ్లాతో టెస్టు, టీ20 సీరీస్లలో చోటు దక్కించుకోలేకపోయిన బుమ్రా... డిసెంబర్లో న్యూజిలాండ్తో సిరీస్కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం.
పునరాగమనం రెట్టింపు ఉత్సాహంతో...
గాయం తర్వాత తన పునరాగమనంపై పలు వార్తలు వస్తున్న తరుణంలో వీటిపై స్పష్టతనిచ్చాడు బుమ్రా. రీఎంట్రీ సింహంలాగా బలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపించిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ట్వీట్ చివర్లో సింహం ఎమోజీ పెట్టి...తనెంత కసిగా ఉన్నాడో తెలిపాడు.
"క్రీడల్లో గాయాలు కావడమనేది ఓ భాగం. త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపిన వారికి ధన్యవాదాలు. నేనెప్పుడూ తలెత్తుకొనే ఉంటాను. ఎదురుదెబ్బల కన్నా బలంగా పునరాగమనం చేయడమే నా లక్ష్యం"
-- బుమ్రా, భారత క్రికెటర్
కుటుంబంతోనే..
ఒత్తిడి కారణంగా బుమ్రా వెన్నులో కింది వైపున చిన్న చీలిక వచ్చింది. కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులుసూచించారు. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కొన్ని రోజులు ఉండనున్నాడీ క్రికెటర్. గాయం నుంచి కోలుకోవడంపైనే శ్రద్ధ పెట్టిన బుమ్రా.. ఎటువంటి వేడుకలు, కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. దీపావళి వేడుకల్లో భాగంగా ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఇచ్చిన విందుకూ బుమ్రా దూరంగా ఉన్నాడు. కుటుంబంతోనే పండుగరోజు సరదాగా గడిపాడు. ఇటీవలే ప్రతిష్టాత్మక విజ్డెన్ ఇండియా అల్మానక్ 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారానికి ఎంపికయ్యాడు.