ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ గాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కమిన్స్ వేసిన బంతి పంత్ ఎడమ చేతికి గట్టిగా తగిలింది. దీంతో అతడు విలవిల్లాడాడు. వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించినా నొప్పిని భరించలేకపోయాడు. కాసేపటికే హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్ వార్నర్ చేతికి చిక్కి పంత్ ఔటయ్యాడు.
అనంతరం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటయ్యాక.. పంత్‌ను స్కానింగ్ చేయించేందుకు తరలించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించగా, పంత్ స్థానంలో సాహా కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.