ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌లపై భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్స్‌మెన్‌గా ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని ప్రశంసించాడు. వీరిద్దరికీ బౌలింగ్ చేయడమంటే సవాలుతో కూడుకున్న విషయమని పేర్కొన్నాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుల్దీప్.. అనేక విషయాలను పంచుకున్నాడు.
"స్మిత్ ఎక్కువగా నా బౌలింగ్‌లో బ్యాక్ ఫుట్ ఆడతాడు. ఆటను చాలా నెమ్మదిగా కొనసాగిస్తాడు. కాబట్టి స్మిత్‌కు బౌలింగ్ వేయడం సవాలుతో కూడుకున్న పని. వన్డేల్లో డివిలియర్స్ చాలా మంచి బ్యాట్స్‌మన్. అతనిదో ప్రత్యేక శైలి. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించాడు. అది మంచి విషయమే అయినప్పటికీ.. పరుగుల విషయంలో ఏబీలా నన్ను భయపెట్టే బ్యాట్స్‌మన్‌ను ఇంతవరకూ చూడలేదు"
కుల్దీప్ యాదవ్, టీమ్ఇండియా స్పిన్నర్
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు కుల్దీప్. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిటనట్లు తెలిపాడు. అయితే గతేడాది సరైన ప్రదర్శన కనబరచకపోవడానికి కారణాలు వెల్లడించాడు.
"నాలో కొన్ని నైపుణ్యాలు లేవు. ఇదే జట్టులో స్థానంపై సందేహాలను రేకెత్తించింది. 2019 ప్రపంచకప్‌కు వెళ్లే ముందు ఐపీఎల్ వైఫల్యాన్ని అధిగమించాలనుకున్నా. ఎక్కువ వికెట్లు తీయకపోయినా సరే ప్రపంచకప్‌లో బాగానే బౌలింగ్ చేశానని అనుకుంటున్నా. కానీ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యా. ఎవరైనా క్రమం తప్పకుండా ఆడితే వారి ఆత్మవిశాసం పెరుగుతుంది. లేకపోతే, మీకు వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో విఫలమవుతారు"అని కుల్దీప్ చెప్పాడు.
టీమ్ఇండియా స్పిన్నర్ చాహల్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కుల్దీప్ వివరించాడు. తనను ఎప్పుడూ ఓ సోదరుడిలా భావించి, జాగ్రత్తగా చూసుకొనేవాడనని అన్నాడు. తమ మధ్య స్నేహం అలానే ఉందని తెలిపాడు.
మైదానంలో ధోనీని కోల్పోతున్నాం
మైదానంలో ధోనీని మిస్సవుతున్నట్లు యాదవ్ చెప్పాడు. "నేను నా కెరీర్ మొదలుపెట్టినప్పుడు పిచ్‌ను అంచనా వేయడంలో అంత సామర్థ్యం ఉండేది కాదు. కానీ ధోనీతో కలిసి ఆడుతున్నప్పుడు ఇలాంటివి చాలా నేర్చుకున్నా. బౌలింగ్ చేసేటప్పుడు ఎక్కడ బంతి వేయాలో అతడికి బాగా తెలుసు. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడంపై మహీకి మంచి పట్టు ఉంది. అందుకే నేను ఎప్పుడూ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌పై దృష్టి పెట్టలేదు. అయితే బ్యాట్స్‌మెన్ బంతిని ఎటువైపు కొట్టాలనుకుంటున్నాడో మందుగానే అంచనా వేసి ఆ విధంగా ఫీల్డింగ్ ఏర్పాటు చేసేవాడు ధోనీ. అలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసేవాడిని" అని కుల్దీప్ పంచుకున్నాడు.
ఇదీ చూడండి:'యువరాజ్ క్షమాపణ చెప్పి తీరాలి'