ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌ను విజయవంతమైన జట్టుగా నిలిపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీని అందించాడు. ప్రశాంతంగా ఉంటూ అందరి సలహాలూ తీసుకుంటూ జట్టు సభ్యులకు స్వేచ్ఛనిస్తూ తన నాయకత్వ సత్తా ఏంటో నిరూపించాడు. అంతేకాదు.. జట్టు అవసరాల కోసం ఏ పాత్రకైనా వెనుకాడడు. ఓపెనర్‌గా విధ్వంసాలు సృష్టించే హిట్‌మ్యాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఆడాడు. "అవకాశం ఉంటే వీడ్కోలు పలికిన వారిలో ఏ ఆటగాడిని పునరాగమనం చేయిస్తావు?" అన్న ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంది.
రోహిత్‌తో ఓపెనింగా?.. భళే భళే సరదా!
సామాజిక మాధ్యమం ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చాడు రోహిత్ శర్మ. "అవకాశం ఉంటే వీడ్కోలు పలికిన వారిలో ఏ ఆటగాడిని పునరాగమనం చేయిస్తావు?" అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.
రోహిత్ నిరంతరం అభిమానులకు టచ్‌లో ఉంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. అందులో ఓ అభిమాని పై విధంగా ప్రశ్నించాడు. "అవకాశం ఉంటే ఒక్కరిని మాత్రమే కోరుకోను. ఇద్దరిని తీసుకుంటా. సచిన్ తెందూల్కర్, షాన్ పొలాక్‌ను ఎంచుకుంటా" అని హిట్‌మ్యాన్ సమాధానం ఇచ్చాడు. అతడి జవాబును ట్యాగ్ చేస్తూ ముంబయి ఇండియన్స్ "సచిన్, పొలాక్.. పునరాగమనం గురించి మీరేమంటారు?" అని అడిగింది.
ఆ ప్రశ్నకు వారిద్దరూ స్పందించారు. "నీతో కలిసి ఓపెనింగ్ చేయడం సరదాగా ఉంటుంది రోహిత్" అని మాస్టర్ బ్లాస్టర్ అన్నాడు. "వీలైతే నెట్స్‌కు వెళ్తా. కసరత్తులు చేస్తా" అని పొలాక్ బదులిచ్చాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు సచిన్ మార్గదర్శకుడిగా ఉన్నాడు. లీగ్ మొదలైనప్పటి నుంచీ ఆయనకు జట్టుతో ఏదో ఒకరకంగా అనుబంధం ఉంటోంది. ఇక దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్ 2008లో ముంబయి తరఫున 13 మ్యాచులు ఆడి 11 వికెట్లు తీశాడు. 2009లో కోచ్‌గా పనిచేశాడు. 2011లో బౌలింగ్ కోచ్, మెంటార్‌గా ఉన్నాడు.