తెలంగాణ

telangana

విరాట్​ను కెప్టెన్​గా తొలగిస్తారా..?: అక్తర్​

By

Published : Aug 2, 2019, 8:11 AM IST

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ వస్తోన్న వార్తలపై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ స్పందించాడు. భారత క్రికెట్​ను అద్భుతంగా నడిపిస్తోన్న సమయంలో ఇలాంటి ఆలోచనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించాడు.

విరాట్​ను కెప్టెన్​గా తొలగిస్తారా..?: అక్తర్​

ప్రపంచకప్​లో భారత్​ సెమీస్​లోనే ఓడిపోవడం వల్ల కోహ్లీ నాయకత్వంపై చర్చ మొదలైంది. విరాట్​ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి... వన్డేలకు రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమించాలని సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. వీటికి తోడు విరాట్​, రోహిత్‌ మధ్య అంతర్గత విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల వెస్టిండీస్​ పర్యటనకు వెళ్లే ముందు సమాధానమిచ్చాడు కోహ్లీ​. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు మాత్రం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని..." టీమిండియా సారథిగా కోహ్లీ స్థానాన్ని రోహిత్‌ భర్తీ చేయగలడా?" అని ట్విట్టర్​లో ప్రశ్నించాడు. దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్ స్పందించాడు.

" కెప్టెన్​ బాధ్యతల నుంచి విరాట్​ కోహ్లీని తొలగించరని అనుకుంటున్నా. ఎందుకంటే అతడు చాలా విలువైన ఆటగాడు. గత 3 నుంచి 4 ఏళ్లుగా సారథిగా ఉన్నాడు. ఇప్పడు విరాట్​కు మంచి కోచ్​, ఎంపిక కమిటీ సహాయం అవసరం. అవన్నీ తగినట్టు ఉంటే కోహ్లీ నుంచి మంచి ప్రదర్శన లభిస్తుంది. రోహిత్​ మంచి కెప్టెన్​ అనడంలో సందేహమే లేదు. ఐపీఎల్​లో తనదైన ప్రతిభ చూపించాడు. అయినప్పటికీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని కదిలించకుండా కోహ్లీనే కెప్టెన్​గా కొనసాగించాలి. విరాట్​ను సారథిగా తప్పించాలని కోరడం నిజంగా హాస్యాస్పదం ".
--షోయబ్​ అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​

భారత జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని వస్తోన్న వార్తలపైనా సమాధానమిచ్చాడు అక్తర్​. రోహిత్​ కెప్టెన్​ బాధ్యతల కోసం వేచిచూస్తున్నాడని, విరాట్​ ఎవ్వరినీ పట్టించుకోకుండా ఉంటున్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అభిప్రాయపడ్డాడు పాక్​ క్రికెటర్​.

ఇటీవల రోహిత్‌ శర్మ ట్విట్టర్లో పెట్టిన ఓ సందేశం చర్చనీయాంశంగా మారింది. పెవిలియన్‌ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫొటోను పంచుకున్న సెంచరీల వీరడు.. "నేను ప్రతిసారీ కేవలం జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతాను"అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్​ విరాట్​, శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

ABOUT THE AUTHOR

...view details