ఆస్ట్రేలియాతో డిసెంబరులో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్కు అందుబాటులో ఉండడానికి పేసర్ ఇషాంత్ శర్మ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పర్యవేక్షణలో అతను సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండేందుకే! - జాతీయ క్రికెట్ అకాడమీలో ఇషాంత్ శర్మ
ఐపీఎల్లో గాయం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన పేసర్ ఇషాంత్ శర్మ.. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోని పునరావాసం ద్వారా ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పర్యవేక్షణలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కోసం ఇషాంత్ సన్నద్ధమవుతున్నాడు.
![ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండేందుకే! Ishant Sharma working closely with Paras Mhambrey at NCA to get fit for Tests in Australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9565507-168-9565507-1605580803772.jpg)
"టెస్టు సిరీస్ నాటికల్లా భారత జట్టుకు అందుబాటులో ఉండేందుకు ఇషాంత్.. మాంబ్రే పర్యవేక్షణలో శ్రమిస్తున్నట్లు ఎన్సీఏ డైరెక్టర్ ద్రవిడ్.. బీసీసీఐకు సమాచారం అందించాడు. తొలి టెస్టు తర్వాత కోహ్లీ జట్టుకు దూరమయ్యే నేపథ్యంలో ఇషాంత్ రాకతో భారత జట్టు బలపడుతుంది. వికెట్లు తీసే బౌలర్లలో అతనొకడు. ఇషాంత్ అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడుతుంది" అని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది జనవరిలో దిల్లీ తరపున విదర్భతో రంజీ మ్యాచ్ ఆడుతుండగా ఇషాంత్ కుడి చీలమండకు గాయమైంది. ఆ తర్వాత ఎన్సీఏలో పునరావాసం ద్వారా ఫిట్నెస్ సాధించిన అతను ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో పాల్గొన్నాడు. అయితే తొలి టెస్టు ఆడుతుండగా గాయం మళ్లీ తిరగబెట్టింది. అలా రెండో టెస్టుకు దూరమయ్యాడు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడం వల్ల తిరిగి ఫిట్నెస్ సాధించిన ఇషాంత్.. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరోసారి గాయం తిరగబెట్టడం వల్ల అతను స్వదేశానికి తిరిగి వచ్చాడు.