అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన సెమీస్‌లో పాకిస్థాన్.. యువ భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక 10 వికెట్ల తేడాతో ఓడింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. తమ దేశ క్రికెటర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో.. దాయాది దేశాన్ని చూసి నేర్చుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పాక్ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ కౌంటర్లు - షోయబ్ అక్తర్
తమ దేశ క్రికెట్ బోర్డు.. యువ క్రికెటర్లకు శిక్షణనిచ్చే విషయంలో భారత్‌ను చూసి నేర్చుకోవాలని అన్నాడు మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. పీసీబీ కౌంటర్లు వేశాడు.

'భారత్ అండర్-19 జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్ ఉన్నాడు. ఓ గొప్ప ఆటగాడు.. కోచ్‌గా ఉండాలంటే, అతడి స్థాయికి తగ్గట్లు జీతభత్యాలు ఇవ్వాలి. పాక్ అండర్-19 జట్టు కోచ్‌గా ఉంటానంటూ యూనిస్ ఖాన్ ముందుకొచ్చాడు. కానీ పాక్ క్రికెట్ బోర్డు బేరాలాడింది. మాజీ క్రికెటర్లను ఉపయోగించుకోవడంలో పీసీబీ విఫలమవుతోంది.యువ క్రికెటర్లకు సలహాలిచ్చేందుకు నాతో పాటు మహ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్ సిద్ధంగా ఉన్నారు. మా కోచింగ్‌లో శిక్షణ పొంది, ప్రపంచకప్‌నకు వెళ్లుంటే ఈ తరహా ప్రదర్శన చేసుండేవారా?' అంటూ పీసీబీ అక్తర్ ప్రశ్నించాడు.
ఇప్పటికే పాక్‌కు చెందిన సీనియర్ క్రికెట్ జట్టు.. ప్రమాణాల్ని అందుకోలేక చతికిలపడుతోంది. కోచ్ మిస్బావుల్ హక్.. జట్టులో ఎన్ని సంస్కరణలు తెచ్చినా, క్రికెటర్ల ఆటతీరు మాత్రం మెరుగవడం లేదు.