తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కరోనా వర్సెస్​ క్రికెట్'​ పోరులో గెలిచేదెవరు? - టెస్టు సిరీస్​పై కరోనా ప్రభావం

ప్రేక్షకుల కేరింతలు, ఆటగాళ్ల ప్రదర్శనతో కలకలలాడే క్రీడా మైదానాలు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. లాక్​డౌన్​తో మ్యాచ్​లన్నీ రద్దు చేసిన వేళ.. క్రికెట్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇక ఏడాదంతా ఇంతేనా అనుకుంటున్న సమయంలో ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్టు విండీస్​తో సిరీస్​ను సురక్షితంగా నిర్వహిస్తామని ప్రకటింటింది. మరి ఈ మహమ్మారి వ్యాప్తి నుంచి క్రికెట్​ బయటపడుతుందా?

Is the conduct of cricket tournaments safe in order to spread the corona?
క్రికెట్‌ × కరోనా

By

Published : Jul 7, 2020, 6:29 AM IST

భారత్‌లో దక్షిణాఫ్రికా వన్డేలు వాయిదా. శ్రీలంకలో ఇంగ్లాండ్‌ పర్యటన వాయిదా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ రద్దు. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ నిరవధిక వాయిదా. అక్టోబర్‌లో కంగారూ గడ్డపై ఆరంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌పై సందిగ్ధత. ఇలా కొన్ని నెలలుగా ఎక్కడ చూసిన క్రికెట్‌ ప్రతికూల వార్తలే. ఊహించని ఉపద్రవంలా వచ్చిన కరోనా రక్కసి ప్రపంచ క్రికెట్‌ను ముంచెత్తింది. అంతర్జాతీయ సిరీస్‌లు లేక.. దేశీయ టోర్నీలు ఆడే వీల్లేక ఆటగాళ్లతో పాటు అభిమానులూ నిరాశలో మునిగిపోయారు. ఇక ఈ ఏడాదంతా ఇంతేనా అని బాధపడుతున్న సమయంలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ చిన్న ఆశ రేకెత్తించింది. విండీస్‌తో సిరీస్‌ను సురక్షిత పద్ధతిలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. బుధవారమే తొలి టెస్టు ఆరంభం. కానీ అడ్డూ అదుపూ లేకుండా పాకేస్తున్న వైరస్‌ ఈ సిరీస్‌ను సజావుగా సాగనిచ్చేనా? గడ్డు పరిస్థితులను దాటి క్రికెట్‌ గెలిచేనా?

సౌతాంప్టన్‌

'స్కోర్‌ ఎంత'.. "బ్యాటింగ్‌ ఎవరు చేస్తున్నారు".. "ఆ జట్టులో ఫలానా ఆటగాడు ఉన్నాడా".. ఇలాంటి ప్రశ్నలు విని ఎన్ని రోజులైందో! దేశం ఏదైనా.. ఏ ప్రాంతంలో ఉన్నా? క్రికెట్‌ అనగానే ఒక్కటయ్యే అభిమాన ప్రపంచం ఇన్ని నెలలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ప్రత్యక్ష మ్యాచ్‌లు లేక, టీవీల్లో చూసిన మ్యాచ్‌లనే పదే పదే చూడలేక ప్రజలు విసిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వైరస్‌తో విసిగి వేసారిపోయిన జనాలు దాదాపు 117 రోజుల తర్వాత క్రికెట్‌ మజాను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు పునఃప్రారంభంగా భావిస్తున్న ఇంగ్లాండ్‌, విండీస్‌ మూడు టెస్టుల సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పోటీ పడే జట్లతో సంబంధం లేకుండా తిరిగి క్రికెట్‌ అనుభూతిని పొందేందుకు అందరూ సన్నద్ధమవుతున్నారు. మైదానంలో తలపడే జట్లలో ఏది విజయం సాధించినా పర్లేదు.. కానీ ఈ సిరీస్‌ సజావుగా సాగితే కరోనాపై అంతిమంగా క్రికెట్‌ గెలుస్తుందనడంలో సందేహం లేదు.

అంతా కొత్తగా.. బౌండరీ బాదినా.. వికెట్‌ పడగొట్టినా.. శతకం సాధించినా.. కేరింతలు కొట్టడానికి, కేకలు పెట్టడానికి స్టేడియంలో ప్రేక్షకులు ఉండరు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌ చేర్చిన బౌలర్‌ను అభినందించడానికి సహచర ఆటగాళ్లు గుంపులు కట్టడాలుండవు. బంతిపై మెరుపు తేవడం కోసం ఉమ్ము రాయడం.. ఆటగాళ్లతో చేతులు కలపడం.. తువ్వాళ్లు, డ్రింక్స్‌ను పంచుకోవడం.. ఇలాంటివేవీ మ్యాచ్‌లో కనబడవు. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు పరీక్షలు, ఆట ముగిసిన వెంటనే హోటల్‌ గదుల్లో బందీ కావడం తప్పనిసరి. మ్యాచ్‌ సమయంలో ఏ క్రికెటర్‌కైనా వైరస్‌ సోకితే సబ్‌స్టిట్యూట్‌గా మరో ఆటగాడు దిగనున్నాడు.

టెన్నిస్‌ పాఠం!

ఆడ్రియా ఎగ్జిబిషన్‌ టోర్నీ పేరు వింటే చాలు టెన్నిస్‌ ప్రపంచం కలవరపడుతోంది. ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌ నిర్వహించిన ఈ టోర్నీలో తనతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఎలాంటి భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, పెద్ద సంఖ్యలో అభిమానులను స్టేడియాలకు అనుమతించి మ్యాచ్‌లు నిర్వహించడం వైరస్‌ వ్యాప్తికి కారణమైంది. కరోనాకు ముందు రోజుల్లోలాగా ఆటగాళ్లు విందులు, వినోదాల్లో పాల్గొనడంతో జకోవిచ్‌పై పెద్ద ఎత్తున విమర్శలూ వినిపించాయి. ఆ టోర్నీతో ఒక్కసారిగా యుఎస్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌తో పాటు ఇతర క్రీడా టోర్నీల నిర్వహణపై కూడా భయం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌లో అలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకూడదు. ఆ టెన్నిస్‌ టోర్నీ ద్వారా పాఠం నేర్చుకుని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని వారాల ముందే ఇంగ్లాండ్‌ చేరుకున్న విండీస్‌ ఆటగాళ్లు అక్కడ క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు.అందరూ నెగెటివ్‌ అని తేలాకే మ్యాచ్‌కు సిద్ధమయ్యారు.

మార్గదర్శిగా నిలిచేనా?

బయో సెక్యూర్‌ బబుల్‌.. ఈ సిరీస్‌ నిర్వహణ కోసం ఇంగ్లాండ్‌ ఎంచుకున్న విధానమిది. రెండు జట్ల ఆటగాళ్లతో పాటు సిబ్బంది, మ్యాచ్‌ ప్రతినిధులు, ప్రసార సంస్థ, స్టేడియాలకు చెందిన సిబ్బంది చుట్టూ ఓ గీత గీయడమే ఈ బబుల్‌ విధానం. సిరీస్‌ పూర్తి అయేంతవరకూ ఈ బబుల్‌ నుంచి ఎవరూ బయటకు పోవడానికి, ఇంకెవరూ లోపలికి రావడానికి వీల్లేదు. సురక్షిత వాతావరణంలో, ఎవ్వరూ వైరస్‌ బారిన పడకుండా క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించి.. ఇతర దేశాలకు మార్గదర్శిగా నిలవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్‌ బోర్డు. ఈ సిరీస్‌ విజయవంతంగా ముగిస్తే క్రికెట్‌ ప్రపంచానికి అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ సిరీస్‌ల నిర్వహణ ఊపందుకునే వీలుంది. కానీ అలా కాకుండా ఏ ఒక్క ఆటగాడికి వైరస్‌ సోకినా కూడా మ్యాచ్‌లు నిర్వహించాలంటే మరింత భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదని, ఈ పరీక్షలో క్రికెట్‌ నెగ్గాలని అందరి ఆకాంక్ష.

ఇదీ చూడండి:అత్యుత్తమ కెప్టెన్​- రికార్డుల మహేంద్రుడు ధోనీ

ABOUT THE AUTHOR

...view details