గ్రెనెడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో సంచలన విజయం సాధించింది ఐర్లాండ్. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేశారు కరీబియన్లు. ఫలితంగా మొదటి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలిచింది పసికూన జట్టు. ఐరిష్ జట్టు ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.
'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకుంటున్న పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ ఓపెనర్ దంచేశాడు...
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటింగ్‌లో ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మన్ పాల్ స్టిర్లింగ్ 95 పరుగులు(47 బంతుల్లో; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి ఆకట్టుకున్నాడు. తృటిలో సెంచరీ కోల్పోయినా... కెరీర్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇతడికి మరో బ్యాట్స్‌మన్ కెవిన్ ఓ బ్రెయిన్(48) మంచి సహాకారం అందించాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కేరీ ఫియర్రీ, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు తీయగా.. హెడెన్ వాల్ష్ ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
బలమైన బ్యాటింగ్, అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్న విండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ప్రత్యర్థి ఐర్లాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తుందని అంతా భావించారు. ఎవిన్ లూయిస్(53) మంచి ఆరంభమే ఇచ్చినా... సిమన్స్(22), హెట్మెయిర్(28), కెప్టెన్ పొలార్డ్(31), పూరన్(26), రూథర్‌ఫోర్డ్(26) పరుగులు చేసినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది కరీబియన్ జట్టు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు తీయగా, క్రెగ్ యంగ్ 2, డాక్రెల్ , సిమి సింగ్ తలో వికెట్ సాధించారు.
మూడు టీ20ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది ఐర్లాండ్ జట్టు. తర్వాత మ్యాచ్ సెయింట్ కిట్స్ వేదికగా ఈ నెల 19న జరగనుంది.