తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్2020: సన్​రైజర్స్ బలాలు, బలహీనతలు ఇవే! - సన్ రైజర్స్ హైదరాబాద్ బలహీనతలు

ఈ ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లు కసరత్తులు చేస్తున్నాయి. టైటిల్ కోసం పోరు ఈసారి రసవత్తరంగా ఉండనుంది. కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరగబోతున్న ఈ లీగ్ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఈ క్యాష్ రిచ్ లీగ్​లో రైజర్స్ ఎంతవరకు రాణిస్తుందో తెలుసుకుందామా.

IPL2020: Strength and Weakness of Sunrisers Hyderabad
సన్​రైజర్స్ బలాలు, బలహీనతలు ఇవే!

By

Published : Sep 10, 2020, 6:37 PM IST

Updated : Sep 10, 2020, 7:53 PM IST

సన్​రైజర్స్ హైదరాబాద్.. గత సీజన్​లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించినా.. ఎలిమినేటర్ మ్యాచ్​లో దిల్లీ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఈసారి వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుని సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగబోతుంది. స్పాట్ ఫిక్సింగ్​ కేసులో ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న స్టార్ ఆల్​రౌండర్ షకిబుల్ హసన్​ ఈ ఏడాది జట్టుకు దూరమయ్యాడు. డేవిడ్ వార్నర్​ కెప్టెన్​గా గతేడాది మంచి ప్రదర్శన చేసిన ఈ జట్టు ఈసారి ఎలా ఆడబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్​ఆర్​హెచ్​ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

బలాలు

1. ఓపెనింగ్ జోడీ

కెప్టెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్​స్టో వంటి విధ్వంసకర ఆటగాళ్లతో సన్​రైజర్స్​కు బలమైన ఓపెనింగ్ జోడీ కుదిరింది. గత సీజన్​లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ వీరు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా వార్నర్​ కొనసాగుతుండగా.. గతేడాది అరంగేట్రంలోనే అదరగొట్టిన బెయిర్​స్టో మ్యాచ్​ మ్యాచ్​కూ పరిణతి కనబరుస్తున్నాడు. ఈసారి కూడా లెఫ్ట్​, రైట్ కాంబినేషన్​తో ఈ జోడీ అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

భారతీయ ఆటగాళ్లు

2. స్పిన్ దళం

ఎస్​ఆర్​హెచ్​ గెలుపులో స్పిన్ దళానిది ప్రత్యేక పాత్ర అని చెప్పుకోవచ్చు. యూఏఈలోని పిచ్​లు కూడా స్పిన్నర్లకే అనుకూలించే అవకాశం ఉండటం వల్ల అఫ్ఘానిస్థాన్ ఆల్​రౌండర్​ రషీద్ ఖాన్​ ఈ సీజన్​లో కీలక పాత్ర పోషించనున్నాడు. మహ్మద్ నబీ సహకారం రషీద్​కు బాగానే లభిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న కరీబియన్ ప్రీమియర్ లీగ్​లోనూ ఇతడు సత్తా చాటుతున్నాడు. అలాగే భారత స్పిన్నర్ షాబాద్ నదీమ్ నుంచి కూడా మంచి ప్రదర్శనే ఆశించవచ్చు. అలాగే ఫాబియాన్ అలెన్, సంజయ్ యాదవ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ రూపంలో యువ స్పిన్నర్లు ఉండనే ఉన్నారు.

3. అనుభవం, యువ ఆటగాళ్ల కలయిక

జట్టులో ఈసారి అటు అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లూ ఉన్నారు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో చాలా అనుభవం ఉంది. అలాగే మ్యాచ్​ను చాలా చక్కగా అంచనా వేయగలరు. విరాట్ సింగ్, సంజయ్ యాదవ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, ఖలీల్ అహ్మద్ రూపంలో చక్కని యువ ఆటగాళ్లూ ఉన్నారు.

విదేశీ ఆటగాళ్లు

బలహీనతలు

1.మిడిలార్డర్

ఈ జట్టుకు ఓపెనింగ్ సమస్య లేకపోయినా.. మిడిలార్డర్ సమస్య వెంటాడుతూనే ఉంది. మనీష్​ పాండే, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్ తప్పితే మిగతా వారికి అంతగా అనుభవం లేదు. పవర్​ ప్లేలో సాహా మెరుగైన ప్రదర్శన చేయగలడు. ఇక ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, శ్రీవాత్సవ గోస్వామి ఎలా ఆడతారో చూడాలి. అలాగే నబీ ఫామ్ రిత్యా కేన్ విలియమ్సన్, మిచెల్ మార్ష్​లకు జట్టులో చోటు దక్కకపోవచ్చు. భారత యువ ఆటగాళ్లు సత్తాచాటితేనే మిడిలార్డర్​లో వైఫల్యాలు తగ్గవచ్చు.

2.విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడటం

సన్​రైజర్స్ ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడుతోంది. ముఖ్యంగా వార్నర్, బెయిర్​స్టో, రషీద్ ఖాన్. వీరు విఫలమైతే జట్టు ఆశలు కోల్పోవాల్సిందే. అయితే ఈ సీజన్​ ప్రారంభంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు కొన్ని మ్యాచ్​లను మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇది జట్టుకు ఆందోళన కలిగించే విషయం. ఒకవేళ ఇదే జరిగితే ఇంతకుముందు జట్టుకు సారథ్యం వహించిన కేన్ విలియమ్సన్, భువనేశ్వర్​ కుమార్​లలో ఎవరో ఒకరు జట్టును ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఈ సీజన్​లో అయినా విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడకుండా యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచితే బాగుంటుందనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.

వదులుకున్న ఆటగాళ్లు

అవకాశాలు

ఎక్కువగా యువ ఆటగాళ్లు

సన్​రైజర్స్​కు పెద్ద ప్లస్ ఏంటంటే యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం. అయితే వచ్చిన అవకాశాన్ని వారు ఎలా ఉపయోగించుకుంటారన్న దానిపైనే జట్టు విజయం ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు వీరికి ఎక్కువగా అవకాశాలు రాకపోయినా.. ఈ సీజన్ యూఏఈలో జరుగుతున్నందు వల్ల ఈసారి అందరికీ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లకు కొన్ని మ్యాచ్​ల్లో విశ్రాంతి లభించొచ్చు. విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, ఖలీల్ అహ్మద్, అభిషేక్ శర్మ.. సీనియర్ ఆటగాళ్లు, మెంటార్​ను సరిగా ఉపయోగించుకుని సత్తాచాటాల్సిన అవసరం ఉంది.

ఇంకా నిరూపించుకోవాల్సిన సీనియర్లు

యువ ఆటగాళ్లతో పాటు జట్టులో అనుభవమున్న క్రికెటర్లు కొందరు వారి సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్రదర్శన ఎపుడూ విమర్శకుల కంట్లో పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇతడికి, పంత్​కు మధ్య టెస్టు జట్టులో చోటు కోసం పోరు నడుస్తోంది. అందువల్ల ఈ సీజన్​లో సాహా కచ్చింతగా రాణించాల్సి ఉంది.

మనీశ్ పాండే టీ20ల్లో రెగ్యులర్ ఆటగాడైనా వన్డేల్లో ఇంకా సుస్థిర స్థానం సంపాదించుకోలేదు. అలాగే వచ్చే రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్​లు ఉన్నాయి. అందువల్ల పాండే ప్రదర్శన సెలక్టర్ల దృష్టిలో ఉండనుంది.

సన్​రైజర్స్ షెడ్యూల్

విజయ్ శంకర్.. గతేడాది జరిగిన ప్రపంచకప్​ నుంచి టీమ్​ఇండియాకు ఆడుతున్నా పరిమిత ఓవర్ల జట్టులో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది.

అలాగే షాబాద్ నదీమ్.. చాలా కాలం క్రితమే టెస్టుల్లో చోటు సంపాదించినా అస్థిరమైన ప్రదర్శనతో స్థానం పోగొట్టుకున్నాడు.

కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్ మళ్లీ గాడిన పడాల్సిన అవసరం ఉంది.

ప్రమాదాలు

భారత పేసర్ల సామర్థ్యంపై ప్రశ్న

జట్టులో భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బాసిల్ థంపి, నటరాజన్, సిద్దార్థ్ కౌల్, విజయ్ శంకర్ రూపంలో భారత పేసర్లు ఉన్నారు. ఇందులో భువీ, శంకర్​ల స్థానాలు పదిలమే. మిగతా వారు చోటు కోసం పోటీపడాల్సిందే. ఈ బౌలర్ల మధ్య సమన్వయం, సరైన జోడీలు కుదరకపోతే జట్టు ఎంపికలో యాజమాన్యానికి తలనొప్పి ఖాయం.

భువనేశ్వర్ ఫిట్​నెస్ సమస్య

సన్​రైజర్స్ పేస్ అటాక్​కు భువనేశ్వర్​ సారథ్యం వహిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఇతడిపై చాలా ఒత్తిడి ఉంది. చాలా కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న భువీ సక్సెస్​ పైనే జట్టు విజయం ఆధారపడి ఉంది. ఒకవేళ భువనేశ్వర్ ఇందులో విఫలమైతే జట్టు గెలుపు కష్టమే.

సన్​రైజర్స్ షెడ్యూల్

ఈసారి లీగ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లు రాణించి, భువనేశ్వర్ ఫిట్​నెస్ గాడిన పడి, మిడిలార్డర్ సమస్య కొలిక్కి వస్తే రైజర్స్​కు ఎదురుండదనేది క్రీడా పండితుల అభిప్రాయం. ఏదిఏమైనప్పటికీ ఈసారి లీగ్​లో హైదరాబాద్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Last Updated : Sep 10, 2020, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details