తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్2020: ఆర్​సీబీ బలాలు, బలహీనతలు ఇవే! - ఆర్​సీబీ బలహీనతలు

ఐపీఎల్ 13వ సీజన్​ కోసం అన్ని జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ లీగ్​లో ఈ జట్టు ఇప్పటివరకు అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఫలితంగా ఈసారి అందరి చూపు ఆర్​సీబీపైనే. మరి ఈసారైనా ఈ క్యాష్​ రిచ్ లీగ్​లో కోహ్లీసేన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ క్రమంలో జట్టు బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం.

RCB strengths and weaknesses
ఆర్​సీబీ బలాలు, బలహీనతలు ఇవే!

By

Published : Sep 11, 2020, 6:39 PM IST

Updated : Sep 11, 2020, 6:48 PM IST

ఐపీఎల్ ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పేరుకు గొప్ప గొప్ప ఆటగాళ్లున్నా ప్రతిసారీ విఫలమవుతూ అభిమానులకు నిరాశే మిగులుస్తోంది. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి సూపర్​ స్టార్లు జట్టుకు ట్రోఫీ అందించడంలో విజయవంతం కాలేకపోయారు. ఈసారి వేలంలో ఫించ్, క్రిస్ మోరిస్ వంటి స్టార్ ఆటగాళ్లను తీసుకున్న ఆర్​సీబీ గెలుపుపై విశ్వాసంతో ఉంది. కరోనా కారణంగా లీగ్ యూఏఈకి మారడం, బ్యాట్స్​మెన్, బౌలర్లు, ఆల్​రౌండర్లతో జట్టు సమతూకంగా ఉండటం వల్ల కోహ్లీసేన ఈసారైనా విజేతగా నిలవాలని దృఢ నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్​సీబీ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

బలాలు

బలమైన విదేశీ బ్యాట్స్​మెన్

ఆర్​సీబీకి పెద్ద బలం బ్యాటింగ్ లైనప్. ఎప్పుడూ స్టార్ ఆటగాళ్లతో కళకళలాడే ఈ జట్టు కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ అహ్మద్​లను కోల్పోయినా ఈసారీ గొప్పగానే కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి తోడు ఈసారి కొత్తగా వచ్చిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ అరోన్ ఫించ్ వల్ల బ్యాటింగ్ ఆర్డర్​కు మరింత బలం చేకూరింది. ఎప్పటినుంచో జట్టుకు అండగా నిలుస్తున్న డివిలియర్స్ ఉండనే ఉన్నాడు. అలాగా మొయిన్ అలీ రూపంలో మరో నాణ్యమైన ఆల్​రౌండర్ జట్టులో ఉండటం టాపార్డర్​ను బలంగా మారుస్తోంది. అలాగే బిగ్​బాష్ లీగ్​లో సత్తాచాటిన జోష్ ఫిలిప్ రూపంలో బ్యాకప్ బ్యాట్స్​మన్ కూడా ఉన్నాడు.

ఆర్​సీబీ షెడ్యూల్

స్పిన్​లో వైవిధ్యం

ఆర్​సీబీకి మరో బలం స్పిన్​ విభాగంలో వైవిధ్యం. టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​ రూపంలో అటాకింగ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇతడికి తోడు వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో మెరుగైన ప్రదర్శన కనబర్చగలడు. అలాగే మొయిన్ అలీ లాంటి అనుభవం ఉన్న స్పిన్నర్ ఎలాంటి పిచ్​లపై అయినా సత్తాచాటగలడు. రిచర్డ్​సన్​ గైర్హాజరుతో జట్టులోకి వచ్చిన ఆడం జంపా కూడా నాణ్యమైన స్పిన్నరే. వీరికి తోడు భారత ఆటగాడు పవన్ నేగి మరో ఆప్షన్.

బలహీనతలు

డెత్ ఓవర్లలో తడబాటు

ఈ జట్టులో డెత్ ఓవర్లలో రాణించే బౌలర్లు కనిపించడం లేదు. కొత్తగా దక్షిణాఫ్రికా స్టార్ ఆల్​రౌండర్​ క్రిస్ మోరిస్​ను భారీగా ఖర్చు పెట్టి తీసుకున్నా అతడి ప్రదర్శన పేపర్​పై మాత్రమే బలంగా కనిపిస్తోంది. అసలు గణాంకాలు తీసుకుంటే మరో విధంగా ఉంది. గత రెండు సీజన్లలో వరుసగా 9.27, 10.21 ఎకానమీతో ఇతడు పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం 16 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. యార్కర్ల పరంగా గొప్పగా ఉన్న ఇతడి ప్రదర్శన.. డెత్ ఓవర్లలో ఆర్​సీబీకి పూర్తి ఆధిపత్యం సాధించిపెట్టదనడంలో సందేహం లేదు. అలాగే ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చివరి ఓవర్లలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. వారిని తీసిపారేయడానికి లేదు కానీ.. చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటం వల్ల ఏమాత్రం ప్రదర్శన చేస్తారన్నది అనుమానమే. దీంతో ఆర్​సీబీ అంతో ఇంతో యువ ఆటగాడు నవదీప్ సైనీపై ఆశలు పెట్టుకోవాల్సిందే.

భారతీయ ఆటగాళ్లు

మిడిలార్డర్​లో బలమైన భారత బ్యాట్స్​మెన్ లోపం

ఆర్​సీబీకి అసలు సమస్యేంటంటే టాపార్డర్​ బలంగా కనిపించడం.. మిడిలార్డర్​ లోటుగా ఉంటడం. ఈ సీజన్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. డివిలియర్స్ నాలుగు, మొయిన్​ అలీ ఐదో స్థానంలో బ్యాటింగ్​ చేయగలరు. ఫించ్, డివిలియర్స్, అలీ వీరంతా విదేశీయులే. వీరి తర్వాత మిడిలార్డర్​లో భారతీయ బ్యాట్స్​మెన్ అవసరం. కానీ ఇక్కడ 12 మ్యాచ్​ల అనుభవం ఉన్న గురుకీరత్ సింగ్ మాత్రమే ఆప్షన్​గా కనిపిస్తున్నాడు. ట్రైనింగ్​లో మెరుగయ్యి, సుందర్, సైనీలతో కలిసి ఇతడు సత్తాచాటాలని జట్టు భావిస్తోంది.

మొయిన్ అలీ తప్పితే గొప్ప ఆల్​రౌండర్లు లేరు

వాషింగ్టన్ సుందర్, శివం దూబే రూపంలో ఆల్​రౌండర్లు కనిపిస్తున్నా.. వీరు అంతర్జాతీయ స్థాయిలో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. సుందర్ టీమ్​ఇండియా తరఫున ఒక వన్డే, 23 టీ20లు ఆడాడు. ఐపీఎల్ గత రెండు సీజన్లలో 8 వికెట్లు తీసి, 66 పరుగులు మాత్రమే సాధించాడు. అలాగే దూబే ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ లోటును పూడ్చడానికి ఈసారి క్రిస్ మోరిస్​ రూపంలో నాణ్యమైన ఆల్​రౌండర్​ను తీసుకున్నారు. తనదైన రోజున మోరిస్ బ్యాట్​కు పనిచెప్పగలడు. అలాగే పవన్ నేగి గత రెండు సీజన్లలో 12 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. మొయిన్ అలీ కూడా అటు బంతితో, ఇటు బ్యాట్​తో రాణించగలడు. అలీ, మోరిస్​పైనే భారం వేయడం వల్ల జట్టు సరైన ఫలితాలు సాధించలేదు. ఎందుకంటే జట్టు సమతుల్యం ఎప్పుడూ ఆల్​రౌండర్లపైనే ఆధారపడి ఉంటుంది.

విదేశీ ఆటగాళ్లు

అవకాశాలు

మెరిసేందుకు సిద్ధమైన యువ ఆటగాళ్లు

ఆర్​సీబీకి ఉన్న గొప్ప అవకాశాల్లో యువ ఆటగాళ్ల ప్రతిభ ఒకటి. వీరు లీగ్​లో తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దేవదత్​ పడిక్కల్​ గురించి ఈ మధ్యనే కోచ్ సైమన్ కటిచ్ గొప్పగా చెప్పాడు. అతడిలో అద్భుత ప్రతిభ ఉందని.. జట్టులోకి రావడానికి ఓపికతో ఎదురుచూస్తున్నాడంటూ తెలిపాడు. సుందర్​ తన మాయాజాలాన్ని యూఏఈ పిచ్​లపై ప్రదర్శించాలని చూస్తున్నాడు. అలాగే దూబే, సిరాజ్​లకు ఇంకా చాలా కెరీర్ ఉంది. మరో యువ ఆటగాడు జోష్ ఫిలిప్​పై ఇప్పటికే ఫించ్, స్మిత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఒకవేళ అతడికి అవకాశం వస్తే తప్పకుండా రాణిస్తాడని చెప్పుకొచ్చారు.

టీమ్​ఇండియాలోకి రావాలని చూస్తున్న యువకులు

ఆర్​సీబీలో కోహ్లీ మినహాయిస్తే ప్రతి ఒక్కరూ టీమ్​ఇండియాలో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్న వారే. భారత జట్టులో వికెట్ కీపర్ స్థానంపై ఉన్న అయోమయాన్ని తన ప్రదర్శనతో పోగొట్టాలని చూస్తున్నాడు పార్థివ్ పటేల్. అలాగే ఈ ఏడాదైనా టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నాడు చాహల్. వాషింగ్టన్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ జట్టుకు ఎంపికవుతున్నా తుది జట్టులో చోటు సాధించలేకపోతున్నారు. అరంగేంట్రం తర్వాత విఫల ప్రదర్శనతో దూరమైన సిరాజ్ మళ్లీ అవకాశం కోసం చూస్తున్నాడు. పడిక్కల్ దేశవాళీ నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి జంప్ చేయాలనుకుంటున్నాడు. అందువల్ల వీరందరికీ ఈ ఐపీఎల్ ఓ సువర్ణావకాశం అంటున్నారు క్రికెట్ పండితులు.

ఆర్​సీబీ కొత్త ఆటగాళ్లు

ప్రమాదాలు

కొత్త ఆటగాళ్ల పేలవ రికార్డు

ఈసారి వేలంలో అరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్ లాంటి స్టార్ ఆటగాళ్లను తీసుకుంది ఆర్​సీబీ. కానీ ఐపీఎల్​లో వీరికి పేలవ రికార్డు ఉంది. ఇంతకుముందు చెప్పిన విధంగా క్రిస్ మోరిస్ ఈ లీగ్​లో ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. తనకు పెట్టిన డబ్బుకు న్యాయం చేయలేకపోయాడు. బ్యాటింగ్​లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫించ్​ కూడా ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. గత సీజన్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​కు ఆడిన ఇతడు డిజాస్టర్ పర్పామెన్స్ ఇచ్చాడు. 2018లోనూ 10 మ్యాచ్​ల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు.

స్పీడ్ గన్ స్టెయిన్ కూడా అంతగా రాణించలేదు. గత మూడు సీజన్లలో 8.5 ఎకానమీతో కేవలం 7 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. ఇక షహ్​బాజ్ అహ్మద్, పవన్ దేశ్​పాండే, జోష్ ఫిలిప్, ఇసురు ఉదానా ఇప్పటివరకు లీగ్​లో ఆడలేదు.

ఛాలెంజర్స్

లోయర్ మిడిలార్డర్ కూర్పు

జట్టుకు పెద్ద సమస్య లోయర్ మిడిలార్డర్ కూర్పు. ఈ స్థానాల కోసం సరైన కాంబినేషన్​లు వెతకాల్సి ఉంది. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీ సరైన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఆ ప్రణాళికలు విఫలమైతే జట్టుకు పెద్ద దెబ్బే. యువ ఆటగాళ్లకు కోచ్​, కెప్టెన్ సలహాలిస్తూ వారిని ముందుండి నడిపించాలి.

కొత్త ఆటగాళ్లతో సరికొత్త ఉత్సాహంతో ఉన్న ఆర్​సీబీ ఈసారి పట్టుదలతో ఉంది. మరి ఇప్పటివరకు టోర్నీలో విజేతగా నిలవని కోహ్లీసేన ఈసారైనా అభిమానుల అంచనాల్ని అందుకుంటుందేమో చూడాలి.

Last Updated : Sep 11, 2020, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details