టీ20 ప్రపంచకప్‌కు ఐపీఎల్ సన్నద్ధత లాంటిదని ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిల్లింగ్స్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే ఆ జట్టులో ఇప్పటికే విదేశీ ఆటగాళ్ల స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో.. తుదిజట్టులో తనకు స్థానం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
"దిల్లీ క్యాపిటల్స్ జట్టులోని విదేశీ ఆటగాళ్లను పరిశీలిస్తే.. వారిలో ఏ కాంబినేషన్‌లోనైనా గెలుపునకు అవకాశం ఉంది. గతేడాది జరిగిన టోర్నీలో దిల్లీ జట్టు అసాధారణమైన పోటీతో ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఐపీఎల్ ఆడడం వల్ల టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యే అవకాశం లభించినట్లు అవుతుందని భావిస్తున్నా".
- సామ్ బిల్లింగ్స్, ఇంగ్లాండ్ వికెట్‌కీపర్
యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. అయితే తుదిపోరులో ముంబయి ఇండియన్స్ జట్టుపై ఓటమిని ఎదుర్కొంది. గత సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్మేయర్ తుదిజట్టులో ఆడారు.
ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్‌లోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా ఇంగ్లాండ్ ఆటగాళ్లు టామ్ కరన్, సామ్ బిల్లింగ్ వచ్చి చేరారు. 2016-17 మధ్య జరిగిన ఐపీఎల్ సీజనల్లో సామ్ బిల్లింగ్స్ దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలోనే తొలిసారి రిషబ్ పంత్ ఆటతీరును గమనించినట్లు తెలిపాడు. "గతంలో దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో రిషబ్ పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేశాను. అప్పుడే ఆ పిల్లవాడు ఎవరని రాహుల్ ద్రవిడ్‌ను అడిగాను" అని సామ్ బిల్లింగ్స్ అన్నాడు.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా టోర్నీలో జరగనున్న తొలిమ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తలపడనుంది.
ఇదీ చూడండి:'టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్ కీలకం'