ఐపీఎల్ 13వ సీజన్లో నిరాశపర్చి, తమ ఫ్రాంఛైజీల నమ్మకాన్ని వమ్ముచేసిన కొందరు విదేశీ ఆటగాళ్లు.. స్వదేశం తరఫున మ్యాచ్‌ల్లో సత్తా చాటుతున్నారు. లీగ్ ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే పలు సిరీస్‌లు, టోర్నీల్లో అదరహో అనిపిస్తున్నారు. అప్పుడు నిరాశపర్చిన వారే ఇలా ఆడుతున్నారా? అనేంతగా వీక్షకులను మైమరపిస్తున్నారు. విఫలమైన ప్రత్యర్థి బౌలర్లపైనే తమదైన ప్రదర్శనతో చెలరేగుతున్నారు.
స్టీవ్ స్మిత్...
ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో మెప్పించలేకపోయాడు ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్. ఇతడి కెప్టెన్సీలో రాజస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. సీజన్ మొత్తంగా 311 పరుగులు చేసి స్థాయికి తగ్గట్లు ఆటలేకపోయాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం స్వదేశం తరఫున చెలరేగి ఆడుతున్నాడు. రెండు వన్డేల్లోనూ వరుసగా(105, 104 పరుగులు) సెంచరీలు చేసి అదరగొట్టాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్..
పంజాబ్ జట్టుకు ఆడిన మ్యాక్స్‌వెల్.. ఈసారి ఐపీఎల్‌లో తీవ్రంగా నిరాశపర్చాడు. టీ20ల్లో విధ్వంసక ఆటగాడిగా పేరున్న ఇతడు.. ఐపీఎల్-2020లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో 108 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేదు. అయితే భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 45 పరుగులు(19 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), 63 పరుగులు(29 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అదరగొట్టాడు.
ఆరోన్ ఫించ్..
భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన ఆరోన్ ఫించ్.. ఈసారి ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ బెంగళూరు తరఫున దిగి ఘోరంగా విఫలమయ్యాడు. 12 మ్యాచ్‌ల్లో 268 పరుగులు మాత్రమే చేశాడు. స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మాత్రం వావ్ అనిపిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లోనూ 114 పరుగులు(124 బంతుల్లో,9 ఫోర్లు, 4 సిక్సర్లు), 60 పరుగులు(69 బంతుల్లో,6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి.. సహ ఆటగాళ్లనే ఆశ్చర్యపరిచాడు.