ఐపీఎల్‌కు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా టోర్నీ గురించే చర్చ. ఇక ఈ పొట్టి లీగ్‌లో బౌలర్ల విన్యాసాలతో పాటు బ్యాట్స్మెన్ల విధ్వంసాలు ఉంటాయి. ఈసారి టైటిల్‌ను ఎవరు గెలుపొందుతారు.. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఎంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శన చేస్తారు. ఆరెంజ్ క్యాప్‌ను ఎవరు కైవసం చేసుకుంటారనే ఆసక్తి రేపుతోంది.
లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి బౌలర్లపై బ్యాట్స్మెన్లు పైచేయి సాధిస్తూనే ఉంటారు. ప్రతి సీజన్లోనూ ఎక్కువ పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ హిట్టింగ్తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశమున్న టాప్-5 బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం.
కేఎల్ రాహుల్..
పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ కేఎల్ రాహుల్, మరోసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గత సీజన్లో ఎక్కువ పరుగులు చేసిన ఇతడు.. ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. జట్టులో కెప్టెన్‌గా ఉంటూనే, ఓపెనర్‌గానూ అదరగొడుతున్నాడు. గతేడాది 129.34 సగటుతో 670 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధశతకాలతో పాటు ఓ సెంచరీ ఉంది.
ఈసారి అదే ఉత్సాహంతో బరిలో దిగి ఈ క్యాప్‌ను తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో సెంచరీతో చేసి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్.. ఐపీఎల్లో మరోసారి ఆరెంజ్ క్యాప్‌కు గట్టిపోటీ ఇస్తాడని తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ..
ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ తన బ్యాట్‌తో విజృభించి.. ఓపెనర్‌గానూ బ్యాటింగ్ చేయగలనని నిరూపించాడు. ఇంగ్లీష్ జట్టుపై వన్డే, టీ20 సిరీస్‌లో వరుసగా చేసిన అర్ధశతకాలే ఇందుకు నిదర్శనం! ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ జట్టులోనూ ఓపెనర్‌గా వస్తానని విరాట్ ఇప్పటికే వెల్లడించాడు.
గతేడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లీ.. 42.36 సగటుతో 466 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ ఈసారి ఓపెనర్‌గా రావాలని అనుకున్న నేపథ్యంలో ఆరెంజ్ క్యాప్‌కు ఇతడు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2016 సీజన్లో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు కోహ్లీ.