టీ20 క్రికెట్లోఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రవేశపెట్టి... కొత్త పంథాను ప్రారంభించింది బీసీసీఐ. ఈ లీగ్ రాకతో భారత క్రికెట్లో ఎన్నో మార్పులొచ్చాయి. టీమిండియాలో యువ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శననూ చూస్తున్నారు సెలక్టర్లు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీగా ఇది పేరు తెచ్చుకొని కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా వచ్చే ఏడాది మరిన్ని మార్పులతో రసవత్తరంగా మారనుందీ ఐపీఎల్. ఈ మేరకు బీసీసీఐ యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది.
పవర్ ప్లేయర్...
ఈ టీ20 లీగ్‌లో కొత్తగా 'పవర్ ప్లేయర్' రానున్నాడు. ఓవర్ పూర్తయిన తర్వాతైనా, వికెట్ పడినప్పుడైనా తుదిజట్టులో లేని ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపవచ్చు. ఎవరికైనా గాయమైనా, జట్టుకు అవసరమైన సమయంలో పవర్ ప్లేయర్‌ను తీసుకురావచ్చు. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో మరిన్ని మార్పులను చేయాలని చూస్తున్నారు లీగ్ నిర్వాహకులు.
" పవర్ ప్లేయర్ పద్దతిని ఇప్పటికే అంతర్గతంగా అందరూ బాగుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సభ్యులంతా ఈ విషయంపైమంగళవారం చర్చించనున్నారు."