తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువ జోరుకు టీ20 ప్రపంచకప్​లో చోటు పక్కా!

కరోనా కష్టకాలంలోనూ ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించారు​. యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన 13వ సీజన్​ ఆల్​టైమ్​ హిట్​గా నిలిచి, అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచింది. ఈ సీజన్​లో కొందరు వర్ధమాన ఆటగాళ్లు ఔరా అనిపించే ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో వారికి వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

t20 worldcup news
యువ జోరుకు టీ20 ప్రపంచకప్​లో చోటు పక్కా!

By

Published : Nov 19, 2020, 6:58 PM IST

ఐపీఎల్​ వల్ల భారత క్రికెట్‌ రూపురేఖలే కాకుండా యావత్‌ ప్రపంచం ఆటతీరే మారిపోయింది. 13 ఏళ్లుగా ఈ వేదికపై సత్తా చాటిన ఎందరో యువ క్రికెట్లర్లు.. ఇప్పుడు తమ దేశ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే మన దేశంలోనూ మారమూల ప్రాంతాల్లో దాగున్న యువ ప్రతిభావంతులను బయటి ప్రపంచానికి పరిచయం చేసింది ఈ మెగా లీగ్‌. హార్దిక్‌ పాండ్య, జస్ప్రీత్‌ బుమ్రా, దీపక్‌ చాహర్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే సగం టీమ్‌ఇండియా ఇక్కడి నుంచి తయారైందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్​లో నిలకడగా రాణించిన కొందరు యువ ఆటగాళ్లు.. వచ్చే టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. అందులోని ఐదుగురు క్రికెటర్ల గురించే ఈ కథనం.

ఇషాన్​ కిషన్​

రాంచీ కుర్రాడు ఇషాన్​ కిషన్​.. రాబోయే రోజుల్లో టీమ్‌ఇండియా కీపింగ్‌, బ్యాటింగ్‌ స్లాట్‌కు ప్రధాన పోటీదారుడని పలువురు మాజీలు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టీ20 ప్రపంచకప్​ జట్టులో ఇతడు చోటు దక్కించుకునే అవకాశముంది. ఏడాది కాలంగా పంత్​ అనుకున్న మేర రాణించకపోవడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి ఇతడిపై పడింది. ఈ ఏడాది టీ20 లీగ్‌లో 57.33 సగటుతో ఇషాన్‌ అద్భుతంగా రాణించాడు. టోర్నీలోని 14 మ్యాచ్​ల్లో నాలుగు అర్ధ శతకాలతో మొత్తం 516 పరుగులు పూర్తి చేశాడు. ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా, అత్యధిక సిక్సర్లు(30) సాధించిన వీరుడిగానూ నిలిచాడు. ముంబయి ఇండియన్స్​ వరుసగా రెండో ఏడాది కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇషాన్​ కిషన్​

రవి బిష్ణోయ్​

అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన లెగ్‌ స్పిన్నర్‌ బిష్ణోయ్‌.. అరంగేట్ర ఐపీఎల్​ సీజన్‌లోనూ సత్తా చాటాడు. ఊరించేలా బంతులు వేసి బ్యాట్స్‌‌మెన్‌ను బోల్తా కొట్టించడమే కాకుండా గూగ్లీలతో స్టార్​ ప్లేయర్లనే ముప్పుతిప్పలు పెట్టాడు. 13వ సీజన్​లో కీలక సమాయాల్లో 12 వికెట్లు తీసి సత్తాచాటాడు. 7.36 ఎకానమీతో నిలకడ ప్రదర్శన చేసిన ఈ లెగ్​స్పిన్నర్​.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

రవి బిష్ణోయ్​

వరుణ్​ చక్రవర్తి

ఐపీఎల్​ 13వ సీజన్​లో మిస్టరీ బంతులతో బాగా పాపులర్​ అయ్యాడు తమిళనాడు బౌలర్​ వరుణ్​ చక్రవర్తి. ఈ సీజన్​లో ధోనీ లాంటి స్టార్​ బ్యాట్స్​మన్​ను క్లీన్​బౌల్డ్​ చేసి ఆశ్చర్యపరిచాడు. గతేడాది నుంచి కోల్‌కతా తరఫున ఆడుతున్న వరుణ్‌.. ఈ సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాడు. 17 వికెట్లు తీసి, 6.84 ఎకానమీతో అదరగొట్టాడు. దిల్లీతో తలపడిన ఓ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తుండడం వల్ల ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు. తనదైన బౌలింగ్​తో రాణిస్తున్న వరుణ్.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ రేసులోనూ ఉన్నాడు.

వరుణ్​ చక్రవర్తి

నటరాజన్​

తమిళనాడు స్పీడ్​స్టర్​ టి.నటరాజన్​ జాతీయ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్​లో తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. డెత్​ ఓవర్లలో అసామాన్య రీతిలో యార్కర్లను సంధించాడు. మొత్తం 16 వికెట్లు పడగొట్టాడు. కీలక బౌలర్​ భువనేశ్వర్​ టోర్నీ మధ్యలోనే వైదొలిగినా.. బౌలింగ్​ భారాన్ని భుజాన వేసుకుని నడిపించాడు. హైదరాబాద్​ జట్టు టాప్​-4లో నిలవడంలో ఇతడి ప్రదర్శన కీలకంగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన నటరాజన్.. విదేశీ గడ్డపైనా అదరగొడితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో చోటు ఖాయం!

నటరాజన్

దేవదత్​ పడిక్కల్​..

ఐపీఎల్​ ద్వారా బెంగళూరు యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్ సత్తా క్రికెట్‌ ప్రపంచానికి‌ తెలిసింది. అతడి ఆట చూసిన ఎవ్వరైనా సరే తొలి సీజన్‌ ఆడుతున్నాడా అని నోరెళ్లబెట్టక తప్పదు. అతడి ప్రదర్శన అంత గొప్పగా, నిలకడగా సాగింది మరి. ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌండరీలు బాదడం, బంతిని బట్టి షాట్లను ఎంచుకోవడం ఈ యువ ఆటగాడి ప్రత్యేకత. బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు.. ఫించ్ విఫలమైన సందర్భాల్లో కెప్టెన్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌లు చక్కదిద్దాడు. వరుస అర్ధశతకాలు బాది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా కోహ్లీసేనకు ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక ఆయుధంగా మారాడు. ఈ సీజన్‌లో మొత్తం 473 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లోనూ చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమి కాదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

దేవదత్​ పడిక్కల్​..

ABOUT THE AUTHOR

...view details