ధనాధన్ క్రికెట్‌కు ముందు ఓ ఆసక్తికర అంకం. ఐపీఎల్‌లో 2020 వేలానికి వేళైంది. కోల్‌కతాలో గురువారమే వేలం పాట. అంతర్జాతీయ స్టార్ల నుంచి.. దేశవాళీ సంచలనాల వరకు చాలా మందే అమ్మకానికి ఉన్నారు. చూద్దాం.. ఏ ఫ్రాంఛైజీ ఎంత తెలివిగా కొంటుందో.. ఏ ఆటగాడి పంట పండుతుందో!
వేలం ఎక్కడ?
వేలం తొలిసారి కోల్‌కతాలో జరగనుంది. మధ్యాహ్నం 3.30కు మొదలవుతుంది. స్టార్‌స్పోర్ట్స్‌లో చూడొచ్చు.
ప్రధాన ఆకర్షకులు ఎవరు?
గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్, క్రిస్ లిన్, మోర్గాన్, క్రిస్ మోరిస్, షిమ్రోన్ హెట్‌మయర్‌లు ఈ వేలంలో స్టార్లు. భారీగా పలకవచ్చన్నది అంచనా. భారత్ నుంచి రాబిన్ ఉతప్ప, ఉనద్కత్‌ల కోసం మంచి పోటీ ఉండొచ్చు.
కుర్రాళ్లలో ఎవరిపై ఆసక్తి?
ముంబయి ఆటగాడు యశస్వి జయస్వాల్ కోసం గట్టి పోటీ ఉండొచ్చు. 17 ఏళ్ల యశస్వి ఇటీవలే లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడిగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌లో అతడు ఆడనున్నాడు. అదే టోర్నీలో భారత్‌కు నాయకత్వం వహించనున్న ప్రియమ్ గార్గ్ కూడా ఆసక్తి రేపుతున్నాడు. గార్గ్‌కు మంచి స్ట్రోక్ ప్లేయర్‌గా పేరుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ఓపెనర్ టామ్ బాంటన్‌కు కూడా మంచి ధర పలకొచ్చు. 21 ఏళ్ల ఈ హార్డ్ హిట్టర్ ఇంగ్లాండ్ తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
అతి చిన్న వయస్కుడు నూర్.. 14ఏళ్లే
అఫ్గానిస్థాన్ చిన్నోడు నూర్ అహ్మద్ వేలంలో అందరికన్నా చిన్నోడు. ఈ ఎడమచేతి వాటం చైనామన్ బౌలర్ వయసు కేవలం 14 ఏళ్ల 350 రోజులే. ఇటీవల భారత్‌తో అండర్-19 సిరీస్‌లో నూర్ మెరుగైన ప్రదర్శన చేశాడు.