చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అనూహ్యంగా అధిక ధరకు అమ్ముడై రికార్డు సృష్టించారు భారత యువ క్రికెటర్లు షారుక్ ఖాన్, చేతన్ సకరియా. రూ.20 లక్షల కనీస విలువ జాబితాలో ఉండి.. కోట్ల రూపాయలను తమ ఖాతాలో వేసుకున్నారు. వీరి ప్రస్థానమేంటో తెలుసుకుందామా మరి.
షారుక్ ఖాన్:
ఈ పేరు వినగానే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ గుర్తొస్తాడు. కానీ గత కొంత కాలంగా క్రికెట్లోనూ ఈ పేరు సుపరిచితమైంది. తమిళనాడుకు చెందిన ఈ యంగ్ క్రికెటర్.. బ్యాట్‌తోను, బంతితోనూ రాణించగల సమర్థుడు. 2014లో అండర్-19 వరల్డ్ కప్‌లో స్థానం కోల్పోయిన షారుక్.. తనను తాను మరింత సాన పెట్టుకున్నాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తానెంటో నిరూపించుకున్న ఈ యువ కెరటం.. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లోనూ బాగానే ఆడాడు.
టీ20లకు అవసరమైన బ్యాటింగ్ వేగం, కండబలం అతడి సొంతం. గతంలో ఆఫ్ స్పిన్ వేసేవాడు. ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్‌పై దృష్టిసారించాడు. కఠిన పరిస్థితుల్లో మ్యాచులను ముగించడం అతడి శైలి.