తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: ఈ ఏడాది జాక్​పాట్ ఎవరికో?

ఐపీఎల్​ మినీ వేలం గురువారం (ఫిబ్రవరి 18న) జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. అందరి చూపు ఈసారి వేలంలో పాల్గొనబోతున్న స్టార్ ఆటగాళ్లపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేలంలో భారీ ధర పలికి జాక్​పాట్ కొట్టబోయే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

By

Published : Feb 17, 2021, 9:46 AM IST

IPL Auction 2021
ఐపీఎల్ వేలం: ఈ ఏడాది జాక్​పాట్ ఎవరికో?

ఐపీఎల్ 14వ సీజన్​కు సంబంధించిన మినీ వేలం గురువారం (ఫిబ్రవరి 18) జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. వేలానికి ముందు జట్లు వదిలేసిన స్టార్ ఆటగాళ్లపై కొన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి. వారిని భారీ ధరకు దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీ ధర పలికి జాక్​పాట్ కొట్టబోయే అవకాశం ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం.

క్రిస్ మోరిస్

గతేడాది ఐపీఎల్ వేలానికి ముందు అసలు క్రిస్ మోరిస్​ను ఏ జట్టైనా తీసుకుంటుందా? అనే అనుమానం ఉండేది. కానీ ఇతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సీజన్​లో గాయం కారణంగా అన్ని మ్యాచ్​లు ఆడని మోరిస్.. ఆడిన 9 మ్యాచ్​ల్లో 11 వికెట్లు దక్కించుకున్నాడు. బ్యాట్​తోనూ రాణించాడు. కానీ ఈసారి మినీ వేలానికి ముందు అంటిపెట్టుకున్న ఆటగాళ్లను ప్రకటించిన ఆర్సీబీ మోరిస్​ను వదిలేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆల్​రౌండర్ల విభాగంలో మోరిస్​కు ఈసారి కూడా భారీ ధర దక్కే అవకాశం ఉంది.

క్రిస్ మోరిస్

స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్​ స్టీవ్ స్మిత్​కు అనూహ్యంగా మొండిచేయి చూపించింది రాజస్థాన్ రాయల్స్. బ్యాట్స్​మన్​గానే కాకుండా గతేడాది కెప్టెన్​గానూ ఈ జట్టుకు స్మిత్ సేవలందించాడు. అయితే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ అతడికున్న అంతర్జాతీయ అనుభవంతో ఈసారి వేలంలో కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

స్మిత్

గ్లెన్ మ్యాక్స్​వెల్

కింగ్స్​ ఎలెవన్ పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు మ్యాక్స్​వెల్. ఇతడిని పంజాబ్ 10.75 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆ డబ్బుకు, జట్టు నమ్మకాన్ని వమ్ము చేస్తూ గత సీజన్​లో ఇతడు 106 బంతుల్లో 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్​ మొత్తంలో ఒక్క సిక్స్​ కూడా కొట్టకపోవడం గమనార్హం. దీంతో ఇతడిని వదులుకుంది పంజాబ్. కానీ ఒక్క సీజన్​తో మ్యాక్స్​వెల్ సామర్థ్యానికి ఎలాంటి ముప్పు లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీ20 క్రికెట్​లో అతడికున్న అనుభవమే ఇందుకు కారణం. దీంతో ఈసారి కూడా ఇతడు భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

మ్యాక్స్​వెల్

శివం దూబే

టీమ్ఇండియాకు అరంగేట్రం చేయకముందే యువ ఆటగాడు శివం దూబేను 2018 సీజన్​లో 5 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ సీజన్​లో ఎక్కువ అవకాశాలు దక్కకపోయినా భారత జట్టులో చోటు దక్కించుకున్న కారణంగా గతేడాదీ అతడిని అట్టిపెట్టుకుంది. కానీ వారి నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో మినీ వేలానికి ముందు దూబేను వదిలేసింది బెంగళూరు. కానీ ఇది అతడికి మేలు చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

శివం దూబే

ఆరోన్ ఫించ్

రాజస్థాన్​.. కెప్టెన్ స్మిత్​ను వదిలేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్​ ఫించ్​ను వదిలేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. గతేడాది ఇతడిని 4.8 కోట్లకు దక్కించుకుంది కోహ్లీసేన. కానీ గత సీజన్​లో అంత గొప్ప ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 268 పరుగులు చేసి రెండో అర్ధ భాగంలో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ అతడి ఐపీఎల్ గణాంకాలు చూస్తే.. మొత్తం 87 మ్యాచ్​లు ఆడి 127 స్ట్రైక్ రేట్​తో 2005 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ఇతడికి మినీ వేలంలోనూ మంచి ధర పలికేలా చేసే అవకాశం ఉంది.

ఫించ్

డేవిడ్ మలన్

రెండేళ్లుగా టీ20 క్రికెట్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 19 టీ20లు ఆడిన మలన్​ 53.44 సగటుతో 855 పరుగులు చేశాడు. ఆడిన 19 మ్యాచ్​ల్లో పదింటిలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అత్యధికంగా న్యూజిలాండ్​పై సెంచరీ, దక్షిణాఫ్రికాపై 99 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ఈసారి వేలంలో మలన్​కు భారీ ధర దక్కేలా చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మలన్

మిగిలిన వారిలో!

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వదిలేసిన ఆల్​రౌండర్ ముజిబుర్‌ రెహ్మన్‌ ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. అలాగే కోల్‌కతా ఆటగాడు క్రిస్‌ గ్రీన్‌ కూడా విలువైన ఆటగాడిగా నిలవొచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల గత సీజన్​ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ ఈ టోర్నీలోనే అత్యధిక ధర పలికే విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీ క్యాపిటల్స్‌ వదిలేసిన జాసన్‌ రాయ్‌ ముంబయి వదిలేసిన నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details