తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: కమిన్స్​ భారీ ధరకు కారణాలేంటి...!

కోల్​కతా వేదికగా గురువారం జరిగిన వేలంలో ఆసీస్​ క్రికెటర్​ కమిన్స్​ భారీ ధర పలికాడు. ఇతడి కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అత్యధికంగా రూ.15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ క్రికెటర్​ ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.

IPL Auction 2020
కమిన్స్​ను భారీ ధరకు దక్కించుకోవడానికి కారణాలేంటి...!

By

Published : Dec 19, 2019, 11:50 PM IST

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం మాట్లాడింది. ఐపీఎల్‌ వేలంలో అత్యుత్తమ ఆటగాడిని దక్కించుకున్నామని చెప్పింది. అయితే ఐపీఎల్‌లో 10 ఇన్నింగ్స్‌ల కన్నా ఎక్కువ అనుభవం లేని కమిన్స్‌ ఎందుకని ఈ సారి అత్యుత్తమ ఆటగాడు అయ్యాడు? ఈ ఏడాది అతడి ప్రదర్శన ఎలా ఉంది? అతడి కోసం వేలంలో ఎందుకంత పోటీ నెలకొంది? యువీ తర్వాత ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు ఎందుకు అమ్ముడయ్యాడో చూద్దాం.

కీలక ఆటగాడు...

ఆస్ట్రేలియా జట్టులో ప్యాట్‌ కమిన్స్‌ ప్రధాన ఆటగాడు. ఆ జట్టు బౌలింగ్‌ దాడికి అతడే కీలకం. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయగల సమర్థుడు. తన చాకచక్యంతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడు. అతడు చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వేసే బంతులకు బ్యాట్స్‌మెన్‌ వద్ద సమాధానం ఉండదు. జట్టుకు అవసరమైతే బ్యాటుతోనూ ఆదుకోగలడు. టీమిండియాతో చివరి టెస్టు సిరీస్‌లో అతడు బ్యాటుతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. అందుకే అతడి కోసం అంత పోటీ.

టెస్టుల్లో అగ్రస్థానం...

ప్రస్తుతం కమిన్స్‌ ఐసీసీ టెస్టు బౌలర్లలో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అంటే 2019లో అతడు అద్భుతంగా ఆడుతున్నాడని అర్థం. ఆ ఫామ్‌ 2020 ఐపీఎల్‌లో బాగా ఉపయోగపడగలదని ఫ్రాంఛైజీల నమ్మకం. ఇప్పుడు మ్యాచులు గెలవాలంటే కేవలం బ్యాట్స్‌మెన్‌ ఉంటే సరిపోరు. లక్ష్యాలను కాపాడుకునేందుకు సమయోచితంగా వికెట్లు తీసే బౌలర్లు అవసరం. ఇందుకు కమిన్స్‌ సరిగ్గా సరిపోతాడు. అందుకే దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇతడి కోసం అంతగా పోటీపడ్డాయి.

ట్రాక్​ రికార్డు...

కెరీర్‌లో 28 టెస్టులాడిన కమిన్స్‌ 2.80 ఎకానమీ, 22.18 సగటుతో 134 వికెట్లు తీశాడు. 58 వన్డేల్లో 5.14 ఎకానమీతో 96 వికెట్లు, 25 టీ20ల్లో 7.77 ఎకానమీతో 32 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ, సగటును పరిశీలిస్తే అతడెంత కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడో అర్థమవుతుంది. భారత పిచ్‌లపైనా అతడు చెలరేగగలడు. కమిన్స్‌ ఐపీఎల్‌లో ఆడింది కేవలం 10 ఇన్నింగ్సులే. అయినప్పటికీ 29.35 సగటుతో 17 వికెట్లు తీశాడు. గాయాల కారణంగా అతడు లీగులో ఎక్కువగా ఆడలేదు.

ప్రస్తుతం కమిన్స్‌ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా అతడిని క్రికెట్‌ ఆస్ట్రేలియా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. గాయాలు కాకుండా చూసుకుంటోంది. ఎంపిక చేసిన సిరీసుల్లోనే ఆడిస్తోంది. ఇక 2019లో ఆడిన టీ20ల్లో 26 ఓవర్లు విసిరి 9 వికెట్లు తీశాడు. 16 వన్డేల్లో 4.73 ఎకానమీతో 31 వికెట్లు సాధించాడు. 11 టెస్టుల్లో 2.75 ఎకానమీతో 54 వికెట్లతో సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ఇలాంటి ప్రదర్శన ఎవరికీ లేదు. తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ఈ సారి కోల్‌కతాకు ప్రధాన కోచ్‌. కమిన్స్‌ గురించి అతడికి బాగా తెలుసు. అందుకే అతడిని కొనుగోలు చేయడంలో మెక్‌కల్లమ్​ ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details