ఐపీఎల్ 14వ సీజన్ కోసం జరిగిన మినీ వేలం ముగిసింది. కొంతమంది భారీ ధర దక్కించుకోగా మరికొంత మంది అనూహ్యంగా కనీసం చోటు దక్కించుకోలేకపోయారు. యువ ఆటగాళ్లు కోట్ల ధర పలికి ఆశ్చర్యానికి గురిచేశారు. కొందరు లీగ్‌లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్టబోతున్నారు. ఇలా ఎన్నో విశేషాల నడుమ ముగిసిన వేలంలో ఫ్రాంఛైజీలు కొన్ని అద్భుత నిర్ణయాలతో ఆకట్టుకోగా.. కొన్ని అసలు వారికి పనికి రాని స్లాట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేశాయి. అలా ఈ ఏడాది వేలంలో ఫ్రాంఛైజీలు తీసుకున్న ఉత్తమ, చెత్త నిర్ణయాలు ఏంటో చూద్దాం.
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మ్యాక్స్‌వెల్-వ్యూహాత్మకం
గతేడాది ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపర్చాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అయినా అవేమీ పట్టించుకోకుండా ఇతడిని రూ 14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. కానీ మిడిలార్డర్లో పేలవంగా ఉన్న ఈ జట్టుకు మ్యాక్సీ అనుభవం పెద్ద ప్లస్‌గా చెప్పుకోవచ్చు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల తర్వాత ఇతడు ఈ జట్టుకు అండగా నిలిచే అవకాశం ఉంది. ఇతడు అటు బ్యాటింగ్‌తోనే కాకుండా ఆఫ్ స్పిన్ బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటే ఆర్సీబీకి తిరుగుండకపోవచ్చు.
కైల్ జేమిసన్-అనూహ్యం
ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేసి జట్టుకు విజయాలను అందించి అందరి దృష్టినీ ఆకర్షించాడు న్యూజిలాండ్ యువ పేసర్ కైల్ జేమిసన్. దీంతో ఇతడు ఈసారి వేలంలో ప్రత్యేకార్షణగా నిలిచాడు. దీనిని నిజం చేస్తూ ఇతడిని ఆర్సీబీ ఏకంగా రూ 15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇతడు ఆర్సీబీ డెత్ బౌలింగ్‌కు పెద్ద ప్లస్ అయినా.. కనీస ధర 75 లక్షలు ఉన్న ఆటగాడిని రూ. 15 కోట్ల ధరకు కొనుగోలు చేయడం వారి వ్యూహంలోని లోపాలను చెబుతోంది. అతడి ప్రదర్శన బాగున్నా, జట్టు ప్రణాళికలు ఎలా ఉన్నా జేమిసన్‌కు అంత భారీ ధర వెచ్చించడం సరికాదని అంటున్నారు విశ్లేషకులు.
2. కోల్‌కతా నైట్‌రైడర్స్
షకీబుల్ హసన్-వ్యూహాత్మకం
గత సీజన్ ప్రారంభంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్.. తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈసారి తక్కువ మిగులు బడ్జెట్ ఉన్న రెండో జట్టుగా వేలంలో పాల్గొంది. కానీ వారి డబ్బులను ఎక్కడ ఖర్చు చేయాలో సరిగ్గా వేచి చూసిన ఈ జట్టు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌ను రూ 3.2 కోట్ల ధరకు కొనుగోలు చేసి మంచి పని చేసింది. వీరికి ఇప్పటికే ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నా.. షకీబ్ చేరిక జట్టుకు మరింత బలాన్ని చేకూర్చనుంది.
హర్భజన్ సింగ్-అనూహ్యం
వేలం మొదటి రౌండ్లో ఎవ్వరినీ ఆకట్టుకోనీ టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను రెండో రౌండ్లో కనీస ధర రూ 2 కోట్లకు కొనుగోలు చేసింది కోల్‌కతా నైట్‌రైడర్స్. అనుభవం పరంగా, ఐపీఎల్ రికార్డు పరంగా భజ్జీని స్టార్ ఆటగాడిగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 160 మ్యాచ్‌లు ఆడిన ఇతడు 150 వికెట్లు దక్కించుకున్నాడు. కానీ ప్రస్తుతం ఈ 40 ఏళ్ల స్పిన్నర్ జట్టుకు ఏ విధంగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఇదే వేలంలో వీరు తీసుకున్న షకీబ్‌ను కాదని భజ్జీని ఎంపిక చేసే అవకాశం లేకపోవచ్చు. ఇతడు సుదీర్ఘ కాలంగా ఐపీఎల్‌కు దూరంగా ఉండటం కూడా పెద్ద మైనస్.
3. చెన్నై సూపర్ కింగ్స్
మొయిన్ అలీ - వ్యూహాత్మకం
గత సీజన్లో అభిమానుల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏడో స్థానంలో నిలిచింది ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. జట్టు ప్రధాన ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ ఈ లీగ్‌కు దూరమవడం వల్ల జట్టు సమతుల్యం దెబ్బతిని ఆకట్టుకోలేకపోయింది. షేన్ వాట్సన్ రిటైర్మెంట్తో ఓవర్సీస్ స్లాట్‌ను ఖాళీ చేసుకున్న ఈ జట్టు మొయిన్ అలీ రూపంలో మంచి ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. ఇతడు స్పిన్‌తో పాటు పించ్ హిట్టింగ్తో ఆకట్టుకోగలడు.
కృష్ణప్ప గౌతమ్ - అనూహ్యం
రూ 9.25 కోట్ల భారీ ధరతో కృష్ణప్ప గౌతమ్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది ఇతడి కనీస ధర రూ 20 లక్షలకు 46 రెట్లు ఎక్కువ. ఇప్పటివరకు 24 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ 186 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటినా.. డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కరన్ లాంటి ఆల్‌రౌండర్లు ఉన్న జట్టులో ఇతడి పాత్ర ఏంటన్నది ప్రశ్నార్థకం.
4. ముంబయి ఇండియన్స్
కౌల్టర్‌నీల్ - వ్యూహాత్మకం
ఐదు సార్లు విజేత ముంబయి ఇండియన్స్ ఈసారి వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొత్తం 7 స్లాట్స్ (4 ఓవర్సీస్) ఖాళీలతో వేలంలో పాల్గొన్న ఈ జట్టు వేలానికి ముందు విడుదల చేసిన కౌల్టర్‌నీల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసింది. గతంలో ఇతడిని రూ 8 కోట్లకు తీసుకున్న ముంబయి.. ఈసారి రూ 3 కోట్లు తక్కువగా 5 కోట్లకు కొనుగోలు చేసింది. బౌల్ట్‌కు బ్యాకప్ బౌలర్‌గా ఇతడు మంచి ప్రదర్శన చేస్తాడని జట్టు భావిస్తోంది. బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకునే ఇతడు అవకాశం వస్తే చెలరేగగలడని గత సీజన్లో నిరూపించాడు.
అర్జున్ తెందుల్కర్ - అనూహ్యం
ఈసారి ఐపీఎల్ వేలానికి కంటే ముందు నుంచి అందరి చూపు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్ పైనే ఉంది. కనీస ధర రూ 20 లక్షలతో వేలంలో పాల్గొన్న ఇతడిని అదే ధరకు కొనుగోలు చేసింది ముంబయి. ఇది కాస్త తొందరపాటు నిర్ణయమని చెప్పొచ్చు. కేవలం భావోద్వేగంతోనే ఇతడిని తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అతడి ప్రదర్శనను తక్కువ అంచనా వేయడానికి లేదు. సయ్యద్ ముస్తాక్ అలీలో ఇటీవల అరంగేట్రం చేసిన అర్జున్ రెండు టీ20ల్లో రెండు వికెట్లు సాధించాడు. అలాగే ముంబయి స్థానిక టోర్నీలో 26 బంతుల్లో 77 పరుగులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు.