ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం సన్నద్ధమవుతోంది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు. ఇప్పటికే సారథి ఎంఎస్ ధోనీ సహా అంబటి రాయుడు చెన్నై చేరుకున్నారు. మార్చి రెండో వారంలో సీఎస్కే క్యాంపు ప్రారంభిస్తామని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
"వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మార్చి 8 లేదా 9న శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాలని చూస్తున్నాం. ఇప్పటికే కెప్టెన్ ధోనీ విచ్చేశారు. అంబటి రాయుడితో పాటు అందుబాటులో ఉన్న క్రీడాకారులు క్యాంపులో పాల్గొంటారు. తమిళనాడు క్రికెటర్లు వారికి తోడవుతారు."
- కాశీ విశ్వనాథన్, సీఎస్కే సీఈఓ
ఇప్పటికే మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై.. గతేడాది ఘోర ప్రదర్శనతో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌కు షేన్ వాట్సన్, హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, పియూష్ చావ్లాను వదులుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో మొయిన్ అలీ, క్రిష్ణప్ప గౌతమ్‌ను కొనుగోలు చేసింది.
చెన్నై అట్టిపెట్టుకున్న క్రికెటర్లు: ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, సామ్ కర్రన్, జోష్ హేజిల్‌వుడ్, ఇమ్రాన్ తాహిర్, ఫాఫ్ డుప్లెసిస్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, అంబటి రాయుడు, మిచెన్ శాంట్నర్, రవీంద్ర జడేజా, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, లుంగీ ఎంగిడి, సాయి కిశోర్.
ఇదీ చదవండి:నాలుగో టెస్టు: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్