మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ కోసం బ్యాట్ పట్టి సిక్సులు బాదుతున్నాడు. వచ్చేనెల ప్రారంభమయ్యే మెగా ఈవెంట్‌లో బ్యాట్ ఝుళిపించాలని తీవ్రంగా సాధన మొదలెట్టాడు. కొద్దిరోజుల క్రితమే చెన్నైకి చేరుకున్న మహి.. తాజాగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. సాధన మొదలు పెట్టిన తొలి రోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపించాడు. ప్రాక్టీస్ సందర్భంగా ధోనీ పలు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. దీంతో తమ ఆరాధ్య క్రికెటర్ సాధన చేస్తున్న వీడియోను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్ కోసం గత మార్చిలో చెన్నైకి చేరుకుని కొద్దిరోజులు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే.. అప్పుడు లాక్‌డౌన్ విధించగా ఐపీఎల్ ఆరునెలలు వాయిదా పడింది. చివరికి 2020 సెప్టెంబర్-నవంబర్ కాలంలో యూఏఈలో లీగ్ 13వ సీజన్ జరిగింది.