షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతుండటం, ముంబయిలో మైదాన సిబ్బందికి కొవిడ్ సోకడం వల్ల లీగ్ నిర్వహణపై అనుమానాలు పెరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ విధించింది. అయినా లీగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని సౌరభ్ పేర్కొన్నాడు. మహారాష్ట్ర క్రికెట్ సంఘం కూడా మ్యాచ్‌లు సజావుగా సాగుతాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.
"ముంబయి మున్సిపల్ కమిషనర్‌తో చర్చించాం. లాక్‌డౌన్ నిబంధనల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని భరోసా లభించింది" అని మహారాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. కరోనా తీవ్రత కారణంగా వేదికల జాబితా నుంచి ముంబయిని తప్పిస్తే.. హైదరాబాద్‌లో సురక్షితంగా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పాడు.
ఇదీ చదవండి:బుమ్రా ఐపీఎల్ అరంగేట్రానికి ఎనిమిదేళ్లు
కర్ఫ్యూతో సమస్య లేదు: బీసీసీఐ