మరో కొద్ది రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఫ్రాంచైజీలు వారి వారి ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా బ్యాట్స్‌మెన్ వారి పరుగుల దాహం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్‌లో కొందరు బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి జట్లపై విరుచుపడి భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈసారి కూడా ఇలాంటి ఇన్నింగ్స్నే ఆశిస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
క్రిస్ గేల్ (175)
ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ముందున్నాడు. 2013 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లోనే 175 పరుగులు సాధించి సునామీ సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు 17 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసిన ఇతడు ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తర్వాత పుణెను 133 పరుగులకే పరిమితం చేసిన కోహ్లీసేన 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్రెండన్ మెక్‌కలమ్ (158)
ఐపీఎల్ ప్రారంభ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే అసలు టీ20 బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్‌కలమ్. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మెక్‌కలమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.