ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా 19 రోజులే. ఇలాంటి సమయంలో జట్టులోని ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడం, వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా టోర్నీ నుంచి నిష్క్రమించడం.. ఇలాంటి వరుస సమస్యలు చెన్నై సూపర్‌కింగ్స్‌కు తలనొప్పిగా మారాయి. ఇలాంటి సమయంలో రైనా మూడో స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
అయితే రైనా తర్వాత జట్టులోని కీలకమైన అతడి బ్యాటింగ్ స్థానం కోసం అనుభవజ్ఞులైన సీనియర్లను ఎంచుకుంటారా? యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తారా? అనే విషయంపై కొంతమంది మాజీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరన్ అయితే సరిపోతుందని, భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను బరిలో దించే అవకాశాలున్నాయని మరికొందరు అంటున్నారు.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో రైనా లేని లోటు చెన్నైని ఎంతో బాధపెడుతుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డాడు. కానీ రైనా స్థానాన్ని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు ఇస్తే, అతడు లెగ్ స్పిన్ కూడా వేయగలడని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"టీ20ల్లో కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రతి జట్టు లెగ్ స్పిన్నర్లు ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌ను సులభంగా ఆడతారు. కాబట్టి రైనా వంటి స్టార్ బ్యాట్స్‌మన్‌ను కోల్పోవడం సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బే. కానీ, ఆ స్థానంలో సామ్ కరన్‌ను పంపితే బాగుంటుందని భావిస్తున్నా. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ ఆడితే సీఎస్కేకు ఎక్కువ పరుగులను చేస్తాడని అనుకుంటున్నాను"
-లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌ను వీడుతున్నట్లు సురేశ్ రైనా చెప్పాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో రైనా రెండో స్థానంలో ఉన్నాడు. సీఏస్కే అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇతడి స్థానాన్ని యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో భర్తీ చేయాలని జట్టు యాజమాని ఎన్ శ్రీనివాసన్ భావిస్తున్నారు.
గతే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కరన్.. పంజాబ్ తరపున 9 మ్యాచ్‌లాడి 10 వికెట్లు తీశాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉంది. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రూ.5.5 కోట్లు పెట్టి సామ్‌ను దక్కించుకుంది సీఎస్కే.