ఐపీఎల్ 13వ సీజన్, కాంట్రాక్టు ఆటగాళ్లకు శిక్షణ శిబిరాన్ని దుబాయ్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం. ముంబయిలో పరిస్థితులు మెరుగు కాకపోతే, లీగ్‌నూ యూఏఈలోనే నిర్వహిస్తారట. జులై 17న( శుక్రవారం) జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐపీఎల్-2020 నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదాపై స్పష్టత వస్తే నిర్ణయం తీసుకొనేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే జులై 17(శుక్రవారం) బీసీసీఐ సర్వోన్నత మండలి సమావేశం కానుంది. టీమ్‌ఇండియా భవిష్యత్ పర్యటన ప్రణాళిక గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఐపీఎల్, శిక్షణ శిబిరం విషయమై నిర్ణయం తీసుకుంటారు.
నిజానికి ఐపీఎల్‌ను ముంబయిలో నిర్వహించాలన్నది బీసీసీఐ ఉద్దేశం. కానీ అక్కడ పరిస్థితులు మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రయాణాలు, రవాణా, లాజిస్టిక్స్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే దుబాయ్ అత్యుత్తమమని భావిస్తున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్ దేశాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నా గత అనుభవాల దృష్ట్యా యూఏఈ వైపే మొగ్గు చూపుతున్నారు.