కోల్‌కతా వేదికగా ఈనెల 19న ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని జట్లు ఇప్పటికే తగిన ప్రణాళికల్ని రచించుకుంటున్నాయి. బెంగళూరు, దిల్లీ జట్లు సగం మంది ఆటగాళ్లను వదులుకోగా, ముంబయి, చెన్నై ప్రధాన ఆటగాళ్లను అంటిపెట్టుకుని మరోసారి లీగ్‌లో సత్తాచాటాలని భావిస్తున్నాయి. అయితే జట్టులో ఎంతమంది ఉన్నా తుది టీమ్‌లో మాత్రం కేవలం నలుగురు విదేశీ ప్లేయర్స్ మాత్రమే ఆడాలి. అందువల్ల స్వదేశీ ఆటగాళ్లను ఎక్కువగా ఉపయోగించుకోవడం ముఖ్యం. ఈసారి స్వదేశీ ఆటగాళ్లు ఎక్కువగా కలిగి ఉన్న జట్ల వివరాలు చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్
ఈసారి 20 మందిని అంటిపెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను వదులుకుంది. కెప్టెన్ ధోనీతో పాటు ఆల్‌రౌండర్ సురేశ్ రైనా జట్టుకు పెద్ద బలం. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి మళ్లీ మనసు మార్చుకున్న తెలుగు తేజం అంబటి రాయుడు.. ఈసారి ఐపీఎల్లో సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫామ్ చెన్నైకి అదనపు బలం. బౌలింగ్ విభాగంలో వెటరన్ ప్లేయర్ హర్భజన్ సింగ్‌తో పాటు యువ ఆటగాళ్లు కేఎస్ ఆసిఫ్, దీపక్ చాహర్ బంతితో మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
దిల్లీ క్యాపిటల్స్
చెన్నై తర్వాత స్వదేశీ టాలెంట్‌ను ఎక్కువగా కలిగి ఉంది దిల్లీ క్యాపిటల్స్. ఆరు సీజన్ల తర్వాత 2019 లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి జోరుమీదుంది. ఈ సీజన్లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. ఈసారి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్స్‌మన్ అజింక్యా రహానేలను ట్రేడింగ్ విండో పద్ధతిలో కొనుగోలు చేసి మరింత బలంగా తయారైంది. వీరితో పాటు శిఖర్ ధావన్, పృథ్వీ షా, సారథి శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లాంటి స్వదేశీ స్టార్స్‌తో బలంగా ఉంది క్యాపిటల్స్. బౌలింగ్‌లో అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్ ఉండనే ఉన్నారు.
ముంబయి ఇండియన్స్
ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ముంబయి ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. 10 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబయి ప్రధాన ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. ఈ జట్టులో ముఖ్యంగా సారథి రోహిత్ శర్మతో పాటు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారు. వీరిద్దరే కాక పాండ్య సోదరులు, యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సత్తా చాటాలని భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో రాహుల్ చాహర్, అన్మోల్ప్రీత్ సింగ్, అనుకూల్ రాయ్ లాంటి యువ బౌలర్లు ఉన్నారు.
ఇవీ చూడండి.. ఐపీఎల్ 2020: వేలంలోకి 332 మంది.. అవకాశం 73 మందికే