ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ నాయకత్వంలో 12 సీజన్లలో 9 సార్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన సీఎస్కే.. నాలుగుసార్లు రన్నరప్‌గా, మూడుసార్లు విజేతగా నిలిచింది. సీఎస్కే స్టామినా చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు.
ప్రస్తుత సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతుండగా, చెన్నై మాత్రం అనుకోని అవాంతరాల్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్ సేవలు కోల్పోయింది. క్రికెటర్స్ రుతురాజ్, దీపక్ చాహర్ సహా 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ సమస్యలన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే బలాలు, బలహీనతలు, అవకాశాలపై కథనం.
బలాలు
ఉత్తమ స్పిన్ దళం
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టు విజయవంతమవడానికి స్పిన్ దళమే ప్రధానాస్త్రం. రవీంద్ర జడేజా, కర్ణ శర్మ, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ సాంట్నర్ లాంటి అద్భుత స్పిన్నర్లు ఉన్నారు. ఎలాంటి పిచ్‌పై అయినా రాణిస్తారు. జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్టంప్స్ వెనక ధోనీ ఉండనే ఉన్నాడు. సందర్భానుసారంగా ఆడటం, మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడం, క్లాస్ స్పిన్నర్లను వినియోగించుకోవడంలో మహీ దిట్ట.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు
జట్లన్నింటిలో సీఎస్కే అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్న జట్టు. ఎలాంటి పరిస్థితులోనైనా ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. కాబట్టి ట్రోఫీని గెలుచుకునేందుకు వీరందరూ ఉండటం కలిసొచ్చే అంశం.
బలహీనతలు
సీఎస్క్కు పేస్ విభాగం ఓ సమస్య అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ వేలంలో సామ్ కరన్(ఇంగ్లాండ్) , జోష్ హేజిల్‌వుడ్‌ను(ఆస్ట్రేలియా) కొనుగోలు చేసింది. కరన్ టోర్నీలో బాగా ఆడుతాడని భావిస్తున్నప్పటికీ, హేజిల్‌వుడ్ ప్రదర్శనపై అనుమానాలు ఉన్నాయి.
దీపక్ చాహర్.. నిలకడగా రాణిస్తున్న బౌలర్. లాక్డౌన్ వల్ల దాదాపు ఐదునెలలు ఆటకు దూరమయ్యాడు. కరోనా సోకడం వల్ల ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు. ఫలితంగా ఐపీఎల్ ప్రాక్టీసుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం టోర్నీలో అతడి ప్రదర్శనపై చూపిస్తే ఇబ్బందులే.
డ్వేన్ బ్రావో (వెస్డిండీస్).. టీ20 చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా ఆడే బ్రావో.. వయసు కారణాల రీత్యా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోవచ్చు. లుంగీ ఎంగిడిపైనా అంచనాలు తక్కువే.