వేసవి వస్తోందంటే దేశంలోని క్రీడా ప్రేమికుల కళ్లన్నీ ఐపీఎల్‌పైనే ఉంటాయి. లీగ్ ఆరంభానికి కొన్ని వారాల ముందు నుంచే ఆ ఫీవర్ మొదలైపోతుంది. దాదాపు నెలన్నర పాటు వినోదాల విందులో తడిసి ముద్దయిపోవడానికి సిద్ధమైపోతారు. లక్షల మంది స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తే, కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. అయితే స్టేడియాల్లో అరుపులు, కేరింతల మధ్య మ్యాచ్ చూడటంలో ఉండే మజానే వేరు. కానీ ఈసారి ఆ మజాను అభిమానులకు అందకుండా దూరం చేసింది ప్రాణాంతక కరోనా. అయితే వైరస్ దెబ్బకు ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ లీగ్ పూర్తిగా రద్దు కాకపోయినా.. టోర్నీని కుదించినా, మరే విధమైన మార్పులు జరిగినా ఐపీఎల్ కళ తప్పడం ఖాయం. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ప్రేక్షకుల్ని స్టేడియాల్లోకి అనుమతించే పరిస్థితి కనిపించడం లేదు. అసలు వీక్షకులు లేకుండా మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందన్నది ఓ ప్రశ్న. ఇక విదేశీ క్రికెటర్లు లేకుండా లీగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది మరో ప్రశ్న. ఈ క్రమంలో రెండో దానికి సమాధానమే ఈ కథనం. కేవలం స్వదేశీ స్టార్లతో జట్లను రూపొందిస్తే ఎలా ఉంటుందో చూసేయండి.
రాజస్థాన్ రాయల్స్...
విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన జట్లలో ఒకటి రాజస్థాన్ రాయల్స్. స్టీవ్ స్మిత్, బట్లర్, బెన్ స్టోక్స్ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిందీ జట్టు యాజమాన్యం. వాళ్లు లేకుండా మ్యాచ్‌లు జరిగితే ఆ జట్టు సగం బలం కోల్పోయినట్లే.
దేశీయ ఆటగాళ్లలో రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్, శ్రేయస్ గోపాల్ కీలకంగా ఉన్నారు. రాజస్థాన్ కుర్రాడు మహిపాల్ లోమర్ తుది జట్టులో అవకాశం దక్కించుకునే వీలుంటుంది. ముంబయి యువ సంచలనం యశస్వి జైస్వాల్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. నిజంగా స్వదేశీ ఆటగాళ్లతో జరిగితే... ఊతప్ప జట్టుకు సారథ్యం వహించొచ్చు.
జట్టు ఇదే...
యశస్వి జైస్వాల్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్(కీపర్), రాబిన్ ఊతప్ప(కెప్టెన్), రియాన్ పరాగ్, మహిపాల్ లామర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండ్, అనికేత్ రాజ్‌పుత్, వరుణ్ అరోన్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్..
పంజాబ్ జట్టుకు మిగతావాళ్లతో పోలిస్తే స్వదేశీ బలం ఎక్కువగానే ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్ వంటి స్వదేశీ ప్లేయర్లు బాగా ఆడగలిగే సత్తా ఉన్నవాళ్లు.
విదేశీ ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. మహ్మద్ షమి మినహాయిస్తే చెప్పుకోదగ్గ ప్లేయర్ లేడు. ఇషాన్ పోరెల్, అండర్-19 సంచలనం రవి బిష్ణోయ్ ఆశలు రేకెత్తించొచ్చు.
జట్టు ఇదే..
కేఎల్ రాహల్(కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, కే గౌతమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, ఇషాన్ పోరెల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్.
విదేశీ ఆటగాళ్లు లేకుండా ఆడితే ఎక్కువగా ఇబ్బంది పడే జట్లలో ముందుటుంది సన్‌రైజర్స్. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో వంటి వారే ఆ జట్టుకు వెన్నెముక. బౌలింగ్‌లోనూ రషీద్ ఖాన్ వంటి బౌలర్లు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్ వంటి కుర్రాళ్లు ఉన్నా... వాళ్లను నడిపించే సరైన నాయకుడు లేడు. అప్పడు బ్యాటింగ్ భారం మనీశ్ పాండే లేదా విజయ్ శంకర్ తీసుకోవచ్చు. భువనేశ్వర్ జట్టు బౌలింగ్ విభాగాన్ని నడిపించడమే కాకుండా కెప్టెన్‌గానూ బాధ్యతలు చేపట్టాలి.
జట్టు ఇదే..
వృద్ధిమాన్ సాహ(కీపర్), అభిషేక్ శర్మ, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, విరాట్ సింగ్, అబ్దుల్ షమాద్, షహబాజ్ నదీమ్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), ఖలీల్ అహ్మద్, శిద్ధార్థ్ కౌల్.
కోల్‌కతా నైట్‌రైడర్స్...
ఇప్పటికే రసెల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కోల్‌కతా జట్టు.. సునీల్ నరేన్, టామ్ బాంటన్, ఇయాన్ మోర్గాన్, వేలంలో అత్యధిక ధరకు పలికిన పాట్ కమిన్స్ లేకపోవడం ఆ జట్టుకు తీరని నష్టమే. శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, సిద్ధేశ్ లాడ్ వంటి యువ ఆటగాళ్లు జట్టును ఆదుకోవాలి. వీళ్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించొచ్చు. దినేశ్ కార్తీక్ జట్టును నడిపించాలి.
జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్, సిద్ధేశ్ లాడ్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్(కెప్టెన్, కీపర్), రాహుల్ త్రిపాఠి, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, ప్రసిద్ధ్ కృష్ణ
దిల్లీ క్యాపిటల్స్...