మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరిగే ఈ లీగ్ టైటిల్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు శిక్షణ లేకపోవడం పెద్ద సమస్యని అన్నాడు. కానీ, తమ అభిమానులు గర్వించేలా ఆడతామని పేర్కొన్నాడు.
"ఈసారి ఐపీఎల్ భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మమ్మల్ని తీవ్ర బాధకు గురిచేశాయి. ఇలాంటప్పుడు క్రికెట్ పెద్ద సవాలు. అయితే, మా అభిమానుల ఆనందం కోసం కచ్చితంగా ఆడి తీరతాం. బయో బబుల్ వాతావరణంలో మేము క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాం. శిక్షణ లేదు. ముందుకు వెళ్లే దారిలో అడ్డంకులు ఎన్నైనా ఉండొచ్చు.. కానీ, విజయాన్ని సాధించి తీరతాం."