గతేడాది ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఈ క్రమంలోనే అతని అభిమానులు మళ్లీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడా అని ఎదురుచూస్తున్న తరుణంలో.. ఐపీఎల్‌తో తీపి కబురు తీసుకొచ్చాడు మహీ. యూఏఈ వేదికగా లీగ్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న వేళ.. తాజాగా, ధోనీ స్వస్థలం రాంచీలో నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏడాది తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ధోనీ! - ఐపీఎల్ తాజా వార్తలు
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కోసం నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తన స్వస్థలం రాంచీలో బౌలింగ్ మిషన్‌ను ఉపయోగించి ఇండోర్ శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
"గతవారం ధోనీ జేఎస్సీఏ అంతర్జాతీయ మైదానాన్ని సందర్శించాడు. బౌలింగ్ మిషన్‌ను ఉపయోగించి ఇండోర్ ప్రాక్టీస్ చేశాడు. అలా రెండు రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక మళ్లీ రాలేదు. శిక్షణకోసం తిరిగి వస్తాడో లేదో అతని ప్రణాళికలేమిటో ఎవ్వరికీ తెలియదు. అయితే, కచ్చితంగా ప్రాక్టీసు కోసం ఇక్కడికి వచ్చాడని మాత్రం చెప్పగలను" అని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్సీఏ) అధికారి ఒకరు తెలిపారు.
యూఏఈకి బయలుదేరే ముందు సీఎస్కే బృందం చెన్నైలో సమావేశం కానున్నట్లు ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. లీగ్ ప్రారంభించే ముందు.. కనీసం మూడు వారాల పాటు ఆటగాళ్లు శిక్షణలో పాల్గొనేలా సమాలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.