తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాంటీ రోడ్స్‌కే క్యాచ్‌లు నేర్పిస్తున్న మయాంక్‌ - Mayank Agarwal gives fielding training to Jonty Rhodes

ఐపీఎల్‌ 13వ సీజన్‌ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. తాజాగా కింగ్స్​ ఎలెవెన్ పంజాబ్​​ జట్టు ప్రాక్టీస్​లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ జట్టు ఫీల్డింగ్​ కోచ్​, ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన జాంటీ రోడ్స్​కే క్యాచ్​లు పట్టడం నేర్పించాడు ఆ జట్టు ఆటగాడు మయాంక్​ అగర్వాల్​. ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది ఫ్రాంఛైజీ.

IPL practice by kings eleven punjab
జాంటీ రోడ్స్‌కే క్యాచ్‌లు నేర్పిస్తున్న మయాంక్‌

By

Published : Sep 12, 2020, 12:42 PM IST

డ్రీమ్‌ 11 ఐపీఎల్‌ అభిమానుల ముందుకు వచ్చేందుకు వారం రోజులే సమయం ఉంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు సాధనలో నిమగ్నమై ఉన్నారు. కరోనా బారిన పడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం నెగెటివ్‌గా తేలడం వల్ల ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఆటగాళ్లు దుబాయ్‌లో కష్టపడుతున్నారు. ఈసారైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉన్నారు. అయితే, వారి ప్రాక్టీస్‌ సెషన్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ గురించి అందరికీ తెలిసిందే. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా గుర్తింపు పొందాడు. తన ఫీల్డింగ్‌ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

అలాంటి ఆటగాడిని పంజాబ్‌ తమ ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. అయితే, శుక్రవారం రాత్రి జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో జాంటీ ఆటగాడయ్యాడు. ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ అవతారమెత్తాడు. దీంతో మయాంక్‌.. జాంటీ రోడ్స్‌కే కోచింగ్‌ ఇచ్చాడు. ఆ వీడియోను కింగ్స్‌ ఎలెవెన్‌ తమ ట్విట్టర్​లో పంచుకొని సంబరపడింది.

"మయాంక్‌.. జాంటీకీ కోచింగ్‌ ఇస్తున్నాడా? అసలు ఇది నిజమేనా?" అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ వీడియోలో మయాంక్‌ ఒక చేత్తో బ్యాట్‌ పట్టుకొని మరో చేతికి గ్లౌస్‌ తొడిగి బంతిని జాంటీ వైపు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ క్యాచ్‌లు పడుతూ కనువిందు చేశాడు.

మయాంక్‌ 2011 నుంచీ ఐపీఎల్‌ ఆడుతున్నా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేకపోయాడు. టీమ్‌ఇండియాలో, దేశవాళీలో ఎంత బాగా ఆడుతున్నా దాన్ని ఐపీఎల్‌లో కొనసాగించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈసారి యూఏఈలో చెలరేగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా ఈ నెల 19న ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్​తో లీగ్​ ప్రారంభంకానుంది. 20న పంజాబ్‌.. దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details