తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్2020: నైట్​రైడర్స్ బలాలు, బలహీనతలు ఇవే!

ఈ ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కరోనా కారణంగా యూఏఈలో జరగబోతున్న ఈ లీగ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో లీగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ లీగ్​లో సత్తాచాటేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కోల్​కతా నైట్​రైడర్స్. దినేశ్ కార్తీక్ సారథ్యంలో ఈసారి ఈ జట్టు బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Kolkata Knight Riders Strengths and Weaknesses
నైట్​రైడర్స్ బలాలు, బలహీనతలు

By

Published : Sep 12, 2020, 6:27 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్.. 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. గతేడాది దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలో దిగిన ఈ టీమ్​ ఐదో స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్​కు అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి వేలంలో ప్యాట్​ కమిన్స్​ను రికార్డు ధరకు కొనుగోలు చేసిన ఈ జట్టు అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈసారి లీగ్​లో కేకేఆర్ ఎంతవరకు సఫలమవుతుంది? జట్టులో కీలక ఆటగాళ్లు ఎవరు? జట్టు బలాలు, బలహీనతలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం.

బలాలు

టీ20ల్లో ఇద్దరు బలమైన ఆల్​రౌండర్లు

సునీల్ నరేన్, ఆండ్రూ రసెల్.. వీరిద్దరూ ఐపీఎల్​లో అత్యుత్తమ ఆల్​రౌండర్లు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి వల్ల జట్టులో సమతుల్యం ఏర్పడి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్​ బలంగా మారుతుంది. తాజాగా జరిగిన కరీబియన్ లీగ్​లోనూ సత్తాచాటాడు నరేన్. రసెల్​ గత సీజన్​లో జట్టుకు కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఒక ఓవర్​తోనే మ్యాచ్ గమనాన్నే మార్చే సామర్థ్యం ఇతడి సొంతం. వీరి తర్వాత ఉన్న మరో ఆల్​రౌండర్ ఆప్షన్ క్రిస్ గ్రీన్. సీపీఎల్​లో గయానా అమెజాన్ వారియర్స్​కు కెప్టెన్​గా ఉన్న గ్రీన్​ టీ0ల్లో నాణ్యమైన ఆటగాడని చెప్పుకోవచ్చు. ఈసారి వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్​ రూపంలో మరో ఆల్​రౌండర్ జట్టుకు దొరికాడు. భారత యువ ఆటగాడు కమలేశ్ నాగర్​కోటి కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.

కేకేఆర్ షెడ్యూల్

అత్యుత్తమ విదేశీ ఆటగాళ్లు

ప్యాట్ కమిన్స్, ఆండ్రూ రసెల్, సునీల్ నరేన్, క్రిస్ గ్రీన్, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్, లూకీ ఫెర్గుసన్​ వంటి బలమైన విదేశీ ఆటగాళ్లు కేకేఆర్ సొంతం. హార్రీ గున్రే సర్జరీ కారణంగా లీగ్​కు దూరమవగా ఇతడి స్థానంలో తీసుకున్న అలీ ఖాన్​ కూడా మంచి పేసర్. ఇతడు యూఎస్​ఏ ఆటగాడు. దీంతో ఈ లీగ్​లో ఆడబోతున్న మొట్టమొదటి యూఎస్ఏ క్రికెట్​రగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఖాన్. కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో ట్రింబాగో నైట్​రైడర్స్​కు ప్రాతనిధ్యం వహించిన ఇతడు చక్కటి ప్రదర్శన చేశాడు.

బలహీనతలు

పసలేని భారతీయ బ్యాటింగ్ లైనప్

జట్టులో నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు కనిపిస్తున్నా భారతీయ బ్యాటింగ్ లైనప్ మాత్రం కాస్త బలహీనంగా ఉంది. కెప్టెన్​ దినేశ్ కార్తీక్ ఫినిషర్​ పాత్ర పోషిస్తున్నా.. ఇతడి తర్వాత శుభ్​మన్ గిల్, నితీశ్ రానా మాత్రమే చెప్పుకోదగ్గ ఆటగాళ్లుగా కనిపిస్తున్నారు. క్రిస్ లిన్, రాబిన్ ఉతప్పను వదులుకున్న ఫ్రాంచైజీ ఇపుడు గిల్, రానాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రింకూ సింగ్, సిద్దేశ్ లాడ్, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ రూపంలో ఆప్షన్స్​ కనిపిస్తున్నా వీరికి ఐపీఎల్ అనుభవం తక్కువే.

భారతీయ ఆటగాళ్లు

పేలవమైన స్పిన్ విభాగం

గత సీజన్​లో సునీల్ నరేన్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నా.. ఈసారి చావ్లాను వదులుకుంది. ఇతడి స్థానంలో తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకున్నా.. ఇతడు లీగ్​లో ఇప్పటివరకు మూడు ఓవర్లు మాత్రమే వేశాడు. క్రిస్ గ్రీన్​ రూపంలో మరో స్పిన్నర్​ ఉన్నా.. ఇతడికి తుది జట్టులో చోటు కష్టమే. ఎం. సిద్దార్థ్​ కూడా స్పిన్​ విభాగంలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్పిన్ విభాగంలో అనుభవజ్ఞుడిగా కనిపిస్తున్న కుల్దీప్ యాదవ్​ గత సీజన్​లో 9 మ్యాచ్​ల్లో 4 వికెట్లు మాత్రమే సాధించాడు. యూఏఈ పిచ్​లు స్పిన్నర్లకు అనుకూలించడం కేకేఆర్​కు పెద్ద దెబ్బ.

అవకాశాలు

నిరూపించుకునేందుకు సిద్ధమైన యువ ఆటగాళ్లు

దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కేకేఆర్ యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. నితీశ్ రానా, శుభ్​మన్ గిల్​ ఇందుకు ఉదాహరణ. వీరు మంచి ప్రదర్శన కనబరుస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. శివం మావి, కమలేశ్ నాగర్​కోటి బౌలింగ్ విభాగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో మరో యువ బౌలర్ ఉన్నా.. ఇతడు ఎక్కువగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. వీరితో పాటు రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సిద్దేశ్ లాడ్ ఈ సీజన్​లో తామేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

విదేశీ ఆటగాళ్లు

దినేశ్ కార్తీక్ అనుభవం

గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ విజయవంతమైన జట్టుగా కొనసాగింది. ఆ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన కార్తీక్ జట్టును మరింత లోతుగా అధ్యయనం చేసి యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంది. అలాగే టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం, రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న కారణంగా కీపర్ స్థానానికి కార్తీక్ మంచి అవకాశమని సెలక్టర్లు భావించేలా చేయాలి. వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్​లు ఉన్న కారణంగా కార్తీక్​కు ఈ సీజన్ ఎంతో కీలకం.

ప్రమాదాలు

రసెల్, నరేన్​లపై ఎక్కువగా ఆధారపడటం

గత సీజన్​లో రసెల్, నరేన్​లపై ఎక్కువగా ఆధారపడింది కేకేఆర్. వారు అనుకున్న మేర రాణించి జట్టును కాపాడినా.. ఇదంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడూ వీరిద్దరిపై ఆధారరపడం కూడా మంచిది కాదు. జట్టును గెలిపించడానికి ప్రతి ఆటగాడు ముందుకు రావాలి.

కొత్త ఆటగాళ్లు

నిరూపించుకోవాల్సిన రిజర్వ్ ఆటగాళ్లు

కేకేఆర్​కు రిజర్వ్ బెంచ్ అంత బలంగా కనిపించడం లేదు. బ్యాటింగ్ విభాగంలో నిఖిల్ నాయక్, సిద్దేశ్ లాడ్, రింకూ సింగ్​లకు అంతగా అవకాశాలు రావడం లేదు. సందీప్ వారియర్, ఎం.సిద్దార్థ్​లు ఇప్పటివరకు వారేంటో నిరూపించుకోలేకపోయారు. యూఏఈలోని పరిస్థితులు, సుదీర్ఘంగా టోర్నీ జరగబోతుండటం వల్ల రిజర్వ్ ఆటాగళ్లను యాజమాన్యం సానబెట్టాల్సిన అవసరం ఉంది.

తుదిమెరుపు

దినేశ్ కార్తీక్​కు ఈ టోర్నీ ఎంతో కీలకం. అతడు సెలక్టర్ల దృష్టిలో పడాలన్నా, టీమ్​ఇండియా ప్రపంచకప్​ జట్టులో చోటు సంపాదించాలన్న అతడి సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిందే. అలాగే జట్టును ముందుండి నడిపించాల్సిందే. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనుభవం జట్టుకు మరింత బలం. అలాగే ప్యాట్ కమిన్స్, రసెల్, నరేన్ రూపంలో స్టార్ ఆల్​రౌండర్లు ఉన్నారు. వీరందరితో కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఎలాంటి ఫలితాలు రాబడతాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details