కరోనా మహమ్మారి ధాటికి క్రీడా టోర్నీలన్నీ తుడిచి పెట్టుకుపోయాయి. ఏ టోర్నీ, ఏ సిరీస్ ఎప్పుడు మొదలవుతుందన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. వేసవి కాలంలో క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే టోర్నీ ఐపీఎల్. వైరస్ కారణంగా ఇదీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడానికి తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్(ఎస్‌ఎల్‌సీ) ఇప్పటికే ఆఫర్ చేసింది. తాజాగా ఈ జాబితాలో చేరింది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్. ప్రస్తుతానికి రద్దయిన ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఐపీఎల్ నిర్వహణకు అరబ్ దేశం ఆఫర్ - ఐపీఎల్ నిర్వహణకు సిద్ధమైన అరబ్ దేశం
నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధమని యూఏఈ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఐపీఎల్ నిర్వహించడం యూఏఈకి కొత్తేమీ కాదు. 2014లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడం వల్ల అక్కడే 20 మ్యాచ్‌లు జరిగాయి. 'ఐపీఎల్ నిర్వహించేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తిస్థాయి అనుమతులు లేని నేపథ్యంలో దాని గురించి మాట్లాడే ప్రశ్నే లేదు' అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు.
ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ రీషెడ్యూల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బయో సెక్యూర్ స్టేడియాలపై కసరత్తులు ప్రారంభించింది. అయితే, దేశంలో అనేక ప్రాంతాల్లో రెడ్ జోన్లు ఉండటం వల్ల అది సాధ్యపడటం లేదు. 2009(దక్షిణాఫ్రికా), 2014ల్లో మాదిరిగా ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు అరుణ్ ధుమాల్ సమాధానం ఇస్తూ, 'ఆటగాళ్లు, టోర్నీలో పాల్గొనే వ్యక్తుల ఆరోగ్యం, భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు నిలిచిపోయాయి. అందుకే ఈ పరిస్థితుల్లో మేం ఏ నిర్ణయమూ తీసుకోలేం' అని సమాధానం ఇచ్చారు.