ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి తమ జట్టులోని భారత క్రికెరట్లకు శిబిరాన్ని ప్రారంభించేందుకు దిల్లీ క్యాపిటల్స్ సన్నహాలు చేస్తుంది. కానీ ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు నిర్వహించే విషయమై ఆగస్టు 2 జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఆటగాళ్ల మధ్య భౌతిక దూరం పాటిస్తూ, తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
ఆగస్టు 15 నుంచి ప్రాక్టీస్
"ఐపీఎల్ తేదీల గురించి బీసీసీఐ మాకు చెప్పినప్పటి నుంచి ఆటగాళ్లకు ప్రాక్టీసు శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మా యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది. బీసీసీఐ నిర్ణయం వచ్చిన తర్వాత ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. యూఏఈకి ఎలా వెళ్లాలనే విషయమై సమావేశం తర్వాతే స్పష్టత వస్తుంది. క్రికెటర్లకు శిక్షణ ఇక్కడ? లేదంటే ఆ దేశంలో జరపాలా? అనేది తెలిస్తే ప్రణాళికలు వేసుకుంటాం" అని దిల్లీ క్యాపిటల్స్ అధికారి చెప్పారు.