చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొవిడ్-19 ఇక్కట్లు ఇప్పట్లో తప్పేలా లేవు! ఆ జట్టు యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికీ కరోనా వైరస్‌తో బాధపడుతున్నాడు. 14 రోజులు గడుస్తున్నా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గానే వస్తోందని తెలిసింది. దీంతో ఆ జట్టు ప్రణాళికలు, కూర్పులో మార్పులు చేసుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఆగస్టు 20 తర్వాత దుబాయ్ చేరుకున్న చెన్నై శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మంది కొవిడ్ బారిన పడ్డారు. దాంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. యువ పేసర్ దీపక్ చాహర్ త్వరగానే కోలుకున్నాడు. పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడం వల్ల జట్టుతో కలిసి సాధన చేస్తున్నాడు. మిగతా సిబ్బంది వైరస్ నుంచి విముక్తి పొందారు. టాప్, మిడిలార్డర్‌లో ఆడగల రుతురాజ్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. అతడి దేహంలో ఇంకా వైరస్ జాడ కనిపించడం గమనార్హం. సురేశ్ రైనా టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల ఆ స్థానంలో రుతురాజ్‌ను ఆడించాలని సీఎస్‌కే భావించింది.