ఐపీఎల్ నిర్వాహకులు మరో సరికొత్త మ్యాచ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు ధోనీ, కోహ్లీ, రోహిత్ ఒకే జట్టులో కనువిందు చేయనున్నారు. ఈ ఆల్ స్టార్ మ్యాచ్ తొలి సీజన్ ఈ ఏడాది నుంచే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తొలుత ఈ మ్యాచ్‌ను లీగ్ ఆరంభంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఫ్రాంచైజీలతో చర్చించాక టోర్నీ ముగింపు కార్యక్రమంగా మార్చారు. ఇటీవల కాలంలో ఈ మ్యాచ్‌ను కచ్చితంగా రద్దు చేస్తారని వార్తలు వచ్చాయి. వాటన్నింటికి తెరదించుతూ తాజా కబురు వినిపించారు లీగ్ నిర్వాహకులు. ఏయే ఆటగాళ్లు రాణిస్తారో చూసి సీజన్ చివర్లో ఆల్‌స్టార్స్ మ్యాచ్ నిర్వహిస్తామని ఐపీఎల్ పాలక మండలి ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు.
" ఆల్‌స్టార్స్ మ్యాచ్‌ను మేం రద్దు చేయడం లేదు. టోర్నీ చివరకు వాయిదా వేస్తున్నాం. ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో మేం చూడాలనుకుంటున్నాం. ఫామ్ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తాం" అని బ్రిజేస్ పటేల్ తెలిపారు.