12వ ఐపీఎల్ సీజన్ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. కొన్ని జట్లు ఆశించిన ఫలితాలు సాధించక ఢీలా పడుతుంటే మరికొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో దూసుకెళుతున్నాయి. ఈ ప్లేఆఫ్ రేసులు దూసుకొస్తున్న తరుణంలో సీజన్లో మ్యాచ్ విన్నింగ్ అంశమైన బౌలింగ్‌లో ఏ జట్టు ఎన్ని మార్కులు సాధించిందో చూద్దాం....
చెన్నై సూపర్ కింగ్స్.. (9/10)
అవకాశాలను అందిపుచ్చుకోడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు. ఆటగాళ్లను రొటేషన్ చేస్తూ జట్టుకు విజయాలనందిస్తుంటాడు. ఈ సీజన్లోనూ చెన్నై బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. హర్భజన్, తాహిర్‌తో కూడిన స్పిన్ విభాగం 31 వికెట్లు సాధించింది. యువ బౌలర్ దీపక్ చాహర్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీజన్లో రెండో అత్యధిక డాట్ బాల్స్ వేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
దిల్లీ క్యాపిటల్స్ (8.5./10)
బౌలింగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది దిల్లీ జట్టు. రబాడ ఇప్పటికే ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పర్పుల్ క్యాప్ అందుకునే అవకాశం ఉంది. క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, కీమో పాల్లు కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇషాంత్ శర్మ ఫామ్ జట్టుకు అదనపు బలం.
ముంబయి ఇండియన్స్ (8/10)
పేస్ బౌలింగ్ మీద ఆధారపడుతోంది ముంబయి జట్టు. సారథి రోహిత్ శర్మ బౌలర్లను రొటేట్ చేస్తూ జట్టును గెలుపు బాట పట్టిస్తున్నాడు. బుమ్రా, మలింగ, బెహ్రండార్ప్, హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ జట్టు పేసర్లు 40 వికెట్లు తీసి ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్ రాహుల్ చాహర్‌తో పాటు కృనాల్ పాండ్య ప్రదర్శన ఈ జట్టుకు అదనపు బలం.