ఐపీఎల్ 13వ సీజన్.. భారత్లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనిచ్చిన తర్వాతే దీని విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మనదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతుండటం వల్ల టోర్నీని యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.
"మేం ఐపీఎల్ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈసారి కచ్చితంగా బయటదేశంలోనే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మ్యాచ్లను ఒకటి లేదా రెండు మైదానాల్లో, ప్రేక్షకుల లేకుండా జరపాలనే ఆలోచనతో ఉన్నాం. కరోనా ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో వేదిక యూఏఈ లేదా శ్రీలంక అనేది త్వరలో నిర్ణయిస్తాం" -బీసీసీఐ అధికారి