ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్, మెల్బోర్న్ లాంటి స్టేడియాలు క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తుంటాయి. భారత్ విషయానికొస్తే.. ఈడెన్ గార్డెన్స్, వాంఖడె లాంటి స్టేడియాలకు ఉన్న ఖ్యాతే వేరు. ఐకానిక్ స్టేడియాలుగా పేరున్న ఈ మైదానాల్లో మ్యాచ్లు చూడటం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఈ మైదానాల్లో మ్యాచ్లు చూడాలని కోరుకుంటారు. అయితే ఇకపై ప్రతి భారత అభిమానీ తప్పక ఓ మ్యాచ్ చూడాలని కలలు కనే స్టేడియంగా మొతేరా మారిపోతే ఆశ్చర్యమేమీ లేదు. మనం లార్డ్స్ లాంటి స్టేడియాల గురించి మాట్లాడుకున్నట్లే ఇక నుంచి ప్రపంచం ఈ మైదానం గురించి గొప్పగా చర్చించుకోబోతుందంటే అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించబోతోంది. బుధవారం (ఫిబ్రవరి 24) ఈ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుంది.
రాష్ట్రపతి చేతుల మీదుగా..
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరా (అహ్మదాబాద్) మైదానాన్ని బుధవారం (ఫిబ్రవరి 24) రోజు అధికారికంగా ఆరంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు. ప్రధాని మోదీ వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొంటారు.
సామర్థ్యం ఎంతంటే?
1,00,024 సామర్థ్యంతో ఇప్పటిదాకా అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును బద్దలు కొట్టింది మొతేరా. లక్షా పది వేల సామర్థ్యమున్న ఈ మైదానం కోసం దాదాపు రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. క్రికెట్ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా మైదానాలు తీసుకుంటే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్గ్రాడో మే డే స్టేడియం తర్వాతి స్థానం మొతేరాదే. ఇంతకుముందు ఇక్కడున్న పాత స్టేడియాన్ని పునర్నిర్మించి ఇంత భారీగా తీర్చిదిద్దారు. ఇక్కడ తొలి మ్యాచే గులాబీ బంతితో జరగబోతుండటం విశేషం. ఈ నెల 24 నుంచి 28 వరకు భారత్-ఇంగ్లాండ్ డేనైట్ టెస్టుకు మొతేరా ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి టెస్టు, ఆ తర్వాత అయిదు టీ20లకు కూడా మొతేరానే ఆతిథ్యమిస్తుంది. అంటే వచ్చే నెల రోజులు ఇక్కడ సందడే సందడన్న మాట!
ప్రధాని కలల స్టేడియం